ఫైనల్ చేరేదెవరు?
అర్జెంటీనాతో ఇంగ్లాండ్ సెమీస్
అట్లాంటా, జూలై 14: సాకర్ ప్రపంచకప్‌లో మరో రసవత్తర సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, ఇంగ్లాండ్ తలపడబోతున్నాయి. అంచనాలకు తగ్గట్టే సెమీస్‌కు వచ్చిన అర్జెంటీనా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. స్టార్ ప్లేయర్ మెస్సీ సారథ్యం అర్జెంటీనాకు అతిపెద్ద బలం. ప్రత్యర్థిని బట్టి వ్యూహాలు మార్చడంలోనూ దిట్ట. జూలియన్ అల్వారెజ్ వంటి ఫార్వార్డ్ ప్లేయర్లు, అటాకింగ్ డెప్త్ ఆ జట్టుకు మరో బలం.
ఎంత ఒత్తిడి ఉండే మ్యాచ్‌లోనైనా బంతిని ఎక్కువ సేపు తమ నియంత్రణలో ఉంచుకోవడం కూడా అర్జెంటీనా ప్రత్యేకత. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించే మెస్సీపై భారీ అంచనాలున్నాయి. మరోవైపు మెక్సికో, నార్వే వంటి పటిష్టమైన జట్లను ఓడించి ఇంగ్లాండ్ సెమీస్‌లో అడుగుపెట్టింది. స్టార్ ప్లేయర్ బెల్లింగ్‌హామ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
హ్యారీ కేన్ లాంటి అత్యుత్తమ స్ట్రుకర్లతో పాటు అటాకింగ్ మిడ్‌ఫీల్డర్లు ఇంగ్లాండ్‌కు బలం. నాకౌట్ మ్యాచ్‌లలో ఒత్తిడిని తట్టుకుని చివరి వరకూ పోరాడుతున్న ఇంగ్లాండ్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. డిఫెన్స్‌లో కొంచెం తడబడుతున్నా అర్జెంటీనాకు షాకివ్వాలని ఎదురుచూస్తోంది. ఇంగ్లాండ్ అటాకింగ్ గేమ్‌కు, అర్జెంటీనా వ్యూహాత్మక ఆటకూ మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.






