15 July, 2026 | 12:48 AM

పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి

15-07-2026 12:00 AM
  1. విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం..
  2. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కుమార్

ముషీరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి పవన్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎల్. గణేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం  హైదరాబాద్లోని  హైదర్గూడ  ఎన్‌ఎస్‌ఎస్ ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విద్య అనేది ప్రతి విద్యార్థి హక్కు అని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న రూ. 7 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు.

రాష్ట్రంలోని సుమారు 27వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేల కు కుదించే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.  ప్రైవేట్, కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని అరికట్టి ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలన్నారు.  ప్రభుత్వం విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువతతో కలిసి దశలవారీ ఆందోళనలు, నిరసనలు, ఇతర ప్రజాస్వామ్య ఉద్యమాలను చేపట్టి విద్యార్థి ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.  ఈ సమావేశంలో  పిడిఎస్ యు రాష్ట్ర కమిటీ సభ్యుడు బిఎం. వంశీ కుమార్, జి. ప్రవీణ్, జి. యోచన్న, కె. జస్వంత్, ఎం. అరుణ్ పాల్గొన్నారు.