15 July, 2026 | 12:58 AM

కులాలను దూషించే సంస్కృతిని సహించం

15-07-2026 12:00 AM

యువజన కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గ నాయకులు 

ఎల్బీనగర్, జులై 14 : కాంగ్రెస్ పార్టీలో కులాలను దూషించే సంస్కృతి ఎప్పుడూ లేదని, కానీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, ఆయన తండ్రి ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు బీసీ వర్గాలను ఆందోళనకు గురి చేశాయని యువజన కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. యువజన కాంగ్రెస్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు భీమిడి రామకృష్ణారెడ్డి, పర్వతి గణేశ్ రెడ్డి, పన్యాల జైపాల్ రెడ్డి, ఎన్‌ఎస్ యూఐ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి వినయ్ పటేల్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు  సాయి నికేష్ తదితరులు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... శివ చరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో యాదవులు, గౌడ్, బీసీలు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.

అవగాహన లేని దుందుడుకు  మాటలతో పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడడం సరికాదన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో యాదవ, గౌడ్స్, బీసీ సంఘాలు చేస్తున్న ఆందోళనలు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులుగా తమకు బాధ కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతినేలా, పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు మాట్లాడినా.. వారు ఎంతటి వారైనా అధిష్టానం చర్యలు తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ,  మైనారిటీ అట్టడుగు వర్గాలకు అండదండలుగా ఉండే పార్టీ అన్నారు.

బీసీ వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివ చరణ్ రెడ్డి,  ప్రభాకర్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు రోజులుగా జరుగుతున్న ఆందోళనలను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి వాళ్ల  దృష్టికి కూడా తీసుకువెళ్లామని  పేర్కొన్నారు. శివచరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను అధిష్టానం పరిశీలిస్తుందని, పూర్తిస్థాయి  విచారణ తర్వాత వారి పై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. పార్టీలో క్రమశిక్షణ, ఐక్యత, గౌరవాన్ని కాపాడేందుకు పార్టీ నాయకత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దుర్గేష్, ఉపాధ్యక్షులు కోటేష్ , వంశీ, మధుసూదన్, శ్రీనివాస్, హరి తదితరులు పాల్గొన్నారు.