పంచాయతీ నిధులు స్వాహా!
- భర్త ఖాతాకు రూ.1.18 లక్షలు మళ్లించిన పంచాయతీ కార్యదర్శి
- మెదక్ జిల్లా సీతారాంతండాలో వెలుగులోకి
కొల్చారం, మార్చి 17: మెదక్ జిల్లా సీతారంతండా అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేయగా.. వాటిని ఖర్చు చేయకుండా పంచాయతీ కార్యదర్శి తన భర్త బ్యాంకు ఖాతాకు రూ.1.18 లక్షలు మళ్లించినట్టు తెలిసింది. సీతారాం తండాలో పంచాయతీ సెక్రెటరీగా రాజేశ్వరి పనిచేస్తున్నారు. అయితే పంచాయతీ ఎన్నికలు ముగిసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున నిధులు గ్రామ పంచాయతీలకు మంజూరయ్యాయి.
సీతారంతండాకు కూడా నిధులొచ్చాయి. అయితే అందులో రూ.1.18 లక్షలు పలు విడుతల్లో తన భర్త మర్పల్లి లక్ష్మణ్ బ్యాంకు ఖాతాలోకి అక్రమంగా బదిలీ చేసినట్టు సమాచారం. గ్రామపంచాయతీలో మంచినీటి సరఫరా పేర రూ.36 వేలు 20 రోజుల క్రితం డ్రా చేసినట్టు చూపి, మళ్లించినట్టు సమాచారం. కానీ గ్రామపంచాయతీ నీటి సరఫరా కోసం బోరు అద్దెకిచ్చిన పెంటమ్మ అనే మహిళకు ఇంతవరకు డబ్బులు చెల్లించలేదు.
గ్రామ పంచాయతీలో పనిచేయని బోరు మోటారుకు మరమ్మతుల పేర రూ.43 వేల రూపాయలు డ్రా చేశారు. వీటిని కూడా భర్త ఖాతాలోకి మళ్లించినట్టు తెలిసింది. అయితే రూ.43 వేలు పెడితే కొత్త మోటర్ వస్తుందని, రూ.43 వేలతో మోటర్ మరమ్మతులు చేయడం ఏమిటని సీతారాం తండా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధుల డ్రా సమయంలో సమర్పించాల్సిన నోటిఫైల్లపై సీరియల్ నెంబర్ లేకపోవడం, అమౌంట్స్ దిద్దడం, కొన్నిచోట్ల ఖాళీ నోట్ ఫైళ్లు పెట్టి డబ్బులు డ్రా చేసినట్టు తెలిసింది.
పలు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి!
పంచాయతీ ఎన్నికలు ముగిసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున నిధులు గ్రామ పంచాయతీలకు మంజూరయ్యాయి. దీంతో మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు అక్రమాలకు తెర లేపినట్టు తెలుస్తున్నది. నూతనంగా ఎంపికైన సర్పంచులు, ఉప సర్పంచ్ ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కంప్యూటర్ ఆపరేటర్లతో కుమ్మక్కై గ్రామ పంచాయతీల్లో నిధులు స్వాహా చేశారని సమాచారం.
ఈ విషయమై వరిగుంతం గ్రామానికి చెందిన యువకులు గత 15 రోజుల క్రితం ఆధారాలతో సహా ఎంపీడీవో, డీఎల్పీవో, డీపీవోలకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ విచారణలు జరిపిన దాఖలాలు కనిపించడం లేదు. పలు గ్రామపంచాయతీలలో పంచాయతీ సెక్రటరీలు తమ భర్తలు, భార్యల అకౌంట్లోకి, కంప్యూటర్ ఆపరేటర్ల అకౌంట్లోకి నేరుగా నిధులు మళ్లింపు చేపట్టారనే ఆరోపణలున్నాయి.
నిధులు దుర్వినియోగం కాలేదు
సీతారాం తండా పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరగలేదు. గతంలో నేను పెట్టిన ఖర్చులు మాత్రమే తీసుకున్నాను. గ్రామ పంచాయతీ నిధుల్లో ఎలాంటి దుర్వినియోగం జరగలేదు. పంచాయతీ నిధులు వాడుకున్నట్టు నిరూపిస్తే ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం.
రాజేశ్వరి, పంచాయతీ కార్యదర్శి




