18 March, 2026 | 3:33 AM

జీవన్‌రెడ్డిని వదులుకోం

18-03-2026 01:16 AM

ఎమ్మెల్యే సామేల్‌తో అవసరమైతే మరోసారి సారీ చెప్పిస్తాం

మీడియాతో మంత్రి శ్రీధర్‌బాబు చిట్‌చాట్

హైదరాబాద్, మార్చి17(విజయక్రాంతి) : ప్రజా క్షేత్రంలో ఉండి మేం సిక్స్‌లు కొడుతుంటే.. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో సిక్స్‌లు కొడుతున్నారని  రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు  ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ అడుకుంటుందని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై మంత్రి శ్రీధర్‌బాబుపై విధంగా స్పందించారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, అయన అనుభవాలు కూడా అవసరమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.

మంగళవారం అసెంబ్లీలోని మీడియా లాంజ్‌లో మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. బీఆర్‌ఎస్ నాయకులు ఇంకా భ్రమలోనే ఉన్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే అసెంబ్లీ బయటనే ఉండాల్సి వస్తుందని  విమర్శించారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పార్టీలో సీనియర్ నాయకుడని,  ఆయన్ను వదులుకునే ప్రసక్తే లేదన్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని మాట్లాడాలని మంత్రి సూచించారు.

పార్టీలో ప్రతికూల వాతావరణం అనేది సహజమన్నారు. ‘నేను జీవన్‌రెడ్డితో వ్యక్తిగతంగా మాట్లాడుతాను. జీవన్‌రెడ్డి సీనియార్టీలో నేను చాలా చిన్నవాడిని.. ఆయనతో కలిసి పనిచేశాను. అలాంటి వ్యక్తిని ఎలా వదులుకుంటాం. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఫైట్ చేశారు.  పార్టీ పదవులు ఆడగలేదు. ఆయన విషయం ఏఐసీసీ పరిశీలనలో ఉంది. పార్టీ మద్దతు పూర్తిగా ఉంటుంది. జీవన్‌రెడ్డి మనస్థాపానికి గురి అయ్యారు, పార్టీని వీడుతారనేది పుకార్లే.

అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను బాహాటంగా చెప్పారు’ అని మంత్రి పేర్కొన్నారు. జీవన్‌రెడ్డి పార్టీ మారుతారనే వస్తున్న అంశాలపై మీడియా ప్రశ్నించగా, కాంగ్రెస్‌ను వీక్ చేయడానికి మిగిలిన పార్టీలు ఎత్తులు వేయడం సహజమన్నారు. కాంగ్రెస్ నేత గురించి పట్టించుకోవడానికి పక్క పార్టీలకేమి సంబంధనమన్నారు. జగ్గారెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. జగ్గారెడ్డి, జీవన్‌రెడ్డిలు బలమున్న నాయకులేనని, పార్టీలో పదవుల మార్పు అనేది పార్టీ అధిష్ఠానం చూసుకుంటోందన్నారు.

చీఫ్ విప్, విప్‌ల అంశం త్వరలోనే ఉంటుందని, జిల్లాల తగ్గింపు, పునర్విభజన అనేది ఏది కూడా లేదన్నారు. పార్టీ పదవులు అంశం అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు.  విద్యా కమిషన్ ఒక నివేదిక మాత్రమే ఇచ్చిందని, ప్రభుత్వం ఇకా నిర్ణయం తీసుకోలేదని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. విద్యా కమిషన్ నివేదికపై ఎదో జరిగిపోతున్నట్లు బీఆర్‌ఎస్ రాద్దాంతం చేస్తోందన్నారు. సీఎల్పీ సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే రాలేదని, వారు ముందుగానే సమాచారం ఇచ్చారని తెలిపారు.

రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తోందన్నారు.  కేటీఆర్ చేస్తున్నవని నిరాధరణ ఆరోపణలు మాత్రమేనని మంత్రి కొట్టిపారేశారు. పార్లమెంట్ తరహాలోనే అసెంబ్లీలో సెంట్రల్ హాల్ ఉంటుందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకే చోట ఉండేలా పార్టీషన్స్ పనులు చేస్తామన్నారు. గత ప్రభుత్వమే విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ. 15 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు.

అసెంబ్లీ కమిటీలు కూడా త్వరలోనే పూర్తవుతాయన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తామనే నమ్మకం లేకనే బీఆర్‌ఎస్ పోటీ పెట్టలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఒకవేళ సామేల్ వివరణకు కన్విన్స్ కాకుంటే మరోసారి క్షమాపణ చెప్పిస్తామన్నారు. బీజేపీ నాయకులు ఎమ్మెల్యే సామేల్ ఇంటిపై దాడికి వెళ్లితేనే.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లారని మంత్రి తెలిపారు.