17 July, 2026 | 3:48 AM

ఇస్కాన్ జగన్నాథ రథయాత్రలో పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ

17-07-2026 12:00 AM

శేరిలింగంపల్లి,జూలై 16 (విజయక్రాంతి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల నుంచి గోపన్పల్లి వరకు ఇస్కాన్ సైబరాబాద్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించిన శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రలో పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ఇస్కాన్ ప్రతినిధులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి రథయాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ,జగన్నాథ రథయాత్ర అనేది జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్రమాతల పూజల కోసం నిర్వహించే వైభవోపేతమైన ఆధ్యాత్మిక మహోత్సవం. భక్తులు అలంకరించిన భారీ రథాలను వీధుల్లో లాగుతూ భజనలు, సంకీర్తనలు చేస్తూ భగవంతుని సేవ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తులు ఈ పవిత్ర ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు.

భక్తులు భక్తితో రథాన్ని లాగడం ద్వారా జగన్నాథ స్వామి సమస్త అడ్డంకులను తొలగించి, హృదయాలను పవిత్రపరచి, కృష్ణ చైతన్యం ప్రేమపూర్వక భక్తి ద్వారా భగవంతుడు తన భక్తుల ప్రేమను స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని ఆయన వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో మంత్రిప్రగడ సత్యనారాయణ, దూబే,అనిల్,ప్రభాకర్ రెడ్డి,ఇస్కాన్ సైబరాబాద్ ప్రతినిధులు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.