calender_icon.png 9 February, 2026 | 1:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతిగా చల్లితే అనర్థం!

09-02-2026 12:00:00 AM

  1. విపరీతంగా పెరిగిన రసాయన ఎరువుల వాడకం

వరి, పత్తి, మిరప.. పంట ఏదైనా వినియోగం అధికమే..

తగ్గిన భూసారం- పెరిగిన పెట్టుబడి

సూర్యాపేట, పిబ్రవరి 8 (విజయక్రాంతి):  గత కొన్నేండ్లుగా వ్యవసాయ పంటల్లో రసాయన ఎరువుల వాడకం చాలా పెరిగిపోయింది. ప్రస్తుతం ఒక రైతు తన పొలంలో బస్తా యూరియా వేస్తే, పక్క పొలం రైతు ఒకటిన్నర బస్తా యూరియా చల్లే పరిస్థితి నెలకొంది. ఇలా మోతాదుకు మించి ఎరువుల వాడకం ద్వారా భూసారం తగ్గడంతో పాటు పెట్టుబడి ఖర్చులు కూడా అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి.

ఎక్కువ మొత్తంలో ఎరువులు వాడితే పంటలకు కూడా అనర్థమే.. అంతేకాదు అధిక ఎరువుల వాడకం ద్వారా పర్యావరణంపైనా ప్రభావం. చూపుతుంది. నీళ్లలో కరిగిపోకుండా ఉండిపోయి చెరువులు, నదుల్లో కలిసి నీటిని కలుషితం. చేయడంతో పాటు గాలి కూడా విషతుల్యమవుతుంది. ప్రస్తుత యాసంగి సీజన్ లో  ఇప్పటికే వరి పంటను వేయగా అవి కొంతమేర పెరగడంతో యూరియాను చల్లడంలో రైతులు నిమగ్నమయ్యారు. 

అయితే రైతులు సాగు చేసిన పంటకు ఇష్టమొచ్చిన రీతిలో యూరియాను చల్లకుండా అవసరమైన మేరకే యూరియా చల్లాలని వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు. రాను రాను పంట్లలో ఎరువుల వాడకం ఎక్కువగా పెరిగిందని, తద్వారా భూసారం తగ్గిపోతూ భూమి గట్టిగా తయార వుతున్నట్లు వారు వివరించారు.

ఇందుకు ఉదాహరణగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతేడాది అవసరమైన దానికన్నా లక్ష టన్నులకు పైగా ఎక్కువగా ఉపయోగించాలంటే పరిస్థితి ఎంత తీవ్రంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్ మందుల వాడకంలోనూ రైతులు ఇలానే చేశారు. దీన్ని బట్టి చూస్తే రైతులు ఎరువులను ఎంతగా వినియోగిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

అధిక వాడకంతో కలిగే అనర్ధాలు 

పత్తి చేసులో యూరియా ఎక్కువగా వాడితే ఆకులు పెరిగి దిగుబడి పడిపోతుంది. వరిలోనూ అధికంగా యూరియా వేస్తే ఏపుగా పెరిగి కోత కంటే ముందే నేలపై వాలిపోతుంది. పంటలో రోగాలు వచ్చి చీడ, పీడల సమస్య ఎక్కువవుతుంది. భూమిలో జింక్, మెగ్నీషియం లోపం తలెత్తుతుంది. పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోతాయి. మరోవైపు పెట్టుబడి ఖర్చులు పెరిగి రైతులు అప్పుల పాలవుతారు.

ఎకరం పంటలో సత్రజని (యూరియా), భాస్వరం, పొటాష్లు 4:2:1 నిష్పత్తిలో వాడాల్సి ఉండగా, ఉమ్మడి జిల్లాలో వీటిని మూడు రెట్లకు మించి వాడుతున్నట్లు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

 వాడాల్సింది ఇలా.. 

వరిలో ఎకరానికి 120 కిలోల యూరియా, 60 కిలోల డీఏపీ లేదా కాంప్లెక్స్ (భాస్వరం) ఎరువులు, 40 కిలోల పొటాష్ (ఎంవోపీ) వాడాలి. పత్తిలో 120 కిలోల యూరియా, 60 కిలోల భాస్వరం, 60కిలోల పొటాష్, మిర్చి పంటలో 220 కిలోల యూరియా, 80 కిలోల భాస్వరం, 60-80 కిలోల పొటాష్ వేయాలి. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వాదొడ్డు. వీటిని దుక్కిలోనే వేయాలి. లేదా పంట నాటిన 15-20 రోజుల్లో అందించాలి.

వరిలో విషగుళికలతో కలిపి యూరియా చల్లకూడదు. పొలంలో యూరియా వేసేటప్పుడు నీరు ఉండొద్దు. గుళికలు చల్లినప్పుడు నీరు ఉండాలి. రెండింటిని కలిపి. ఒకేసారి వేస్తే, వీటిలో ఏదో ఒకటి మాత్రమే పనిచేసి రెండోది పనికిరాకుండా పోతుంది. వరిలో ఎరువు వేసిన తర్వాత నీరు పెట్టాలి. పత్తిలో మొక్కకు 3-5 సెంటీమీ టర్ల దూరంలో 3 -5 సెం.మీ లోతులో ఎరువులు వేస్తే మొక్కలకు అందుతాయి. పైన మట్టి కప్పకపోతే గాలిలో ఆవిరైపోయి విషతుల్యమవుతాయి. మొక్కకు ఎరువులు అందవు. 

సేంద్రియ ఎరువులను వేస్తున్నా 

గతంలో పంట దిగుబడి ఎక్కువగా రావాలని అధికంగా రసాయనిక ఎరువులను వాదాను. దిగుబడి పెరిగినప్పటికీ పెట్టుబడి ఖర్చులు. అంతకంటే ఎక్కువ అయ్యాయి. పంట కాలం పూ ర్తయ్యాక లెక్క చూసుకుంటే లాభం పోను అప్పులే మిగిలాయి. రసాయనిక ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులను వేయడం ప్రారంభించాను.

 పానుగంటి రవి, మర్రిగూడ, నల్లగొండ జిల్లా

అధికారుల సూచనలు పాటిస్తున్నా.. 

ఎరువుల వాడకంపై అగ్రికల్చర్ ఆఫీసర్ల, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తున్నా, భూసారం తగ్గకుండా, పెట్టుబడి ఖర్చులు పెరగకుండా పంటలు ఎలా పండించాలో వారు చెబుతున్నట్లుగానే ఎరుపులు వేస్తున్నా. దీంతో పంట పెట్టుబడి ఖర్చులు తగ్గి. దిగుబడి పెరిగింది.

 బానోతు.చంద్రు నాయక్, కొత్త దోనబండ తండా, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా