కాంగ్రెస్ పని తక్కువ.. ప్రచారం ఎక్కువ
- మేడిగడ్డ మరమ్మతులు మరిచి తుమ్మిడిహట్టి వద్ద హడావిడి
- మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
- మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట, మే 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం సిద్దిపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పని తక్కువ.. ప్రచారం ఎక్కు వ అంటూ కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. మేడిగడ్డ మరమ్మతులు పక్కనపెట్టి ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద మంత్రులు హడావిడి చేయడం ప్రజలను మభ్యపెట్టడానికేనని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరిస్తోందని, ఎల్‌నినో ప్రభావంతో కరువు వస్తుందని తెలిసినా మేడిగడ్డ మరమ్మతులపై దృష్టి పెట్టలేదన్నారు. కానీ తుమ్మిడిహట్టి పేరుతో పత్రికల్లో ఫోజులు ఇవ్వడం తప్ప చేతల్లో ఏమీలేదని ఘాటుగా విమర్శించారు.మంత్రి వివేక్ చెప్పిన 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణ ఒప్పందం పూర్తిగా అబద్ధమని, ని జంగా ఒప్పందం జరిగి ఉంటే కాంగ్రెస్ పాలనలో పనులు ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు.
తుమ్మిడిహట్టి వద్ద ఎకో సెన్సిటివ్ జోన్, అడవి ప్రాంతం, సుప్రీంకోర్టు అనుమతుల వంటి కీలక అంశాలు పెండిం గ్లో ఉన్నాయని గుర్తుచేశారు.ప్రాణహిత ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించలేదని, కేవలం మాటలతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించడం అంటే తెలంగాణ రైతాంగ ప్రయో జనాలను దెబ్బతీయడమేనన్నారు. ఈ మండుటెండల్లో మేడిగడ్డ వద్ద 6400 క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మేడిగడ్డ పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి రైతులకు సాగు, తాగు నీరు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






