10 May, 2026 | 2:37 AM

యూట్యూబ్ చూసి ఏటీఎం చోరీకి స్కెచ్

10-05-2026 01:23 AM
  1. అలారం మోగడంతో దొంగలు పరార్ 
  2. ఇద్దరిని అరెస్ట్ చేసిన వాడపల్లి పోలీసులు

మిర్యాలగూడ, మే 9 (విజయక్రాంతి): దొంగతనం ఎలా చేయాలన్నది యూట్యూబ్‌లో చూసి మరీ ఏటీఎం చోరీకి స్కెచ్ వేశారు ఇద్దరు. ఏటీఎం ధ్వంసం చేస్తుండగా సెక్యూరి టీ అలారం మోగడంతో భయపడి పారిపోయిన ఇద్దరిని శనివారం వాడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.దొంగతనానికి సంబంధించిన వివరాలను రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్ స్థానిక మిర్యాలగూడ సీఐ కార్యాలయంలో విలేకరులకు తెలిపారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం రామాపురం గ్రామానికి చెందిన మోతుకూరి రమణాచారి, ఏపీకి చెందిన మోహన కుమార్‌రెడ్డిలు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద సెక్యూరిటీ గార్డులుగా పనిచేసేవారు.

వచ్చే ఆదాయం చాలకపోవడంతో ఆ ఉద్యోగాలు మానేసి సొంత గ్రామాలకు వచ్చి ఏప్రిల్ 23న లావురి రమేష్ అనే మిత్రుడితో కలిసి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో సెక్యూరిటీ గార్థు ఉద్యోగాల కోసం వీర్లపాలెం వెళ్లారు. సంబంధిత అధికారులు అందుబాటు లో లేక పోవడంతో ముగ్గురు కలిసి దామరచర్లకి వచ్చి మద్యం సేవించారు. రమేశ్ అక్కడి నుండి వెళ్లిపోగా రమణాచారి, మోహన్ కుమార్‌రెడ్డిలు రాత్రి పొద్దు పోయే వరకు దామరచర్లలోనే ఉన్నారు.

సమీపంలో ఉన్న (డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్) ఏటీఎంను చూసి, అందులో దొంగతనం చేస్తే తమ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పథకం వేశారు. దొంగతనం ఎలా చేయాలో తెలుసుకోవడానికి వారు యూట్యూబ్‌లో వీడియోలను చూసి ప్లాన్ చేశారు. ముఖాలకు దస్తీలు కట్టుకుని, రోడ్డు పక్కన దొరికిన ఒక ఇనుప రాడ్డుతో ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించారు. ఏటీఎం షట్టర్ దించి, మిషన్ను పగుల గొట్టేందుకు యత్నిస్తుండగా సెక్యూరిటీ అలా రం మోగింది. దీంతో భయపడ్డ దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. 

బ్యాంకు వారి ఫిర్యాదు మేరకు ఏటీఎం సీసీ ఫుటేజ్‌ని పరిశీలించిన పోలీసులు, రమేశ్‌కి వీడియో చూపగా వారిని గుర్తించి నింది తుల వివరాలు పోలీసులకు తెలిపాడు. కాగా శనివారం ఇంటి సామాన్లను తరలించేందుకు నిందితులు రామాపురం వచ్చినట్లు తెలుసుకున్న వాడపల్లి పోలీసులు ఇద్దరిని అదుపులో కి తీసుకున్నారు. కేసును ఛేదించిన వాడపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి, ఏఎస్‌ఐ జోజీ, సిబ్బంది సైదులు, సంతోష్ రెడ్డి, యాదగిరి లను డీ ఎస్పీ రాజశేఖర్ రాజు, సీఐ పీఎన్డీ ప్రసాద్ లు అభినందించారు.