అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు
కట్టంగూరు, మే 9 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా పోలీసులు మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా మరో భారీ విజయా న్ని అందుకున్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటుతూ సాగుతున్న భారీ గంజాయి స్మగ్లింగ్ ముఠాను కేతేపల్లి పోలీసులు ఛేదించారు. ఈ దాడుల్లో సుమారు రూ.52.5 లక్షల విలువైన 104.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం ఉదయం కేతేపల్లి పోలీసులు కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.
విజయవాడ నుంచి హైదరాబాద్ దిశగా భారీగా గంజాయి తరలుతున్నట్లు ఎస్‌ఐ సతీష్‌కి అందిన ముందస్తు సమాచారంతో పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి మాటు వేశారు. ఉదయం సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన అశోక్ లేలాండ్ లారీని అడ్డుకోగా, అందులోని ఇద్దరు వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.లారీ వెనుక భాగాన్ని తనిఖీ చేయగా, నాలుగు పెద్ద ప్లాస్టిక్ బస్తాల్లో బ్రౌన్ కలర్ టేప్తో ప్యాక్ చేసిన 103 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. ఒక్కో ప్యాకెట్ కిలో బరువుతో మొత్తం 104.5 కేజీల గంజాయి ఉన్నట్లు క్లూస్ టీమ్ నిర్ధారించింది.వీటితో పాటు లారీని, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.






