15 June, 2026 | 2:46 AM

‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి

15-06-2026 12:14 AM
  1. పీసీసీ మెంబెర్ లోకేష్ యాదవ్ 
  2. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర
  3. సవరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సమావేశం

మధిర, జూన్ 14 (విజయక్రాంతి): టి పి సి సి ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఆదివారం మధిర రెడ్డి గార్డెన్ కళ్యాణ మండపంలో మధిర నియోజకవర్గం స్థాయిలో నిర్వహించిన సమావేశంలో పి సి సి మెంబెర్ లోకేష్ యాదవ్ , రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ... కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. దీనిపై బిఎల్‌ఎ లు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపి ప్రభుత్వం ఓటర్ల జాబితాలో మార్పులు చేయాలనే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని  అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాయల నాగేశ్వరరావు,సూడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి రామారావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ పుల్లిబండ్ల చిట్టిబాబు, మధిర పట్టణ మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.