11 March, 2026 | 1:25 PM

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం

11-03-2026 12:56 AM
  1. వాడీవేడిగా మొదలైన చర్చ

రాహుల్‌గాంధీకి మద్దతుగా నిలిచిన ప్రియాంక

నిబంధనలు సభ్యులందరూ పాటించాలి 

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు

న్యూఢిల్లీ, మార్చి 10: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై మంగళవారం ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో వాడివేడిగా చర్చ సాగింది. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావెద్ లోక్‌సభలో ప్రవేశపెట్టగా అనంతరం ఈ అంశంపై చర్చ మొదలైంది.   ఎంపీ, చైర్‌పర్సన్స్ ప్యానె ల్ సభ్యుడు జగదాంబికా పాల్ ను స్పీకర్‌గా కేంద్రం ఎంపిక చేసింది. ఆయన ఆధ్వర్యం లో అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ కొనసాగుతోంది.అవిశ్వాసంపై చర్చకు స్పీక ర్ 10 గంటల సమయం కేటాయించా రు. అనంతరం తీర్మానంపై ఓటింగ్ నిర్వహించనున్నారు.

కాంగ్రెస్ ఎంపీ జావేద్ స్పీకర్ పై మంగళవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరిం చడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ తీర్మానం ప్రవేశ పెట్టింది. ముఖ్యంగా రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లా డేందుకు విపక్ష నేత రాహుల్‌గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం,

కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబె పై చర్యలు తీసుకోకపోవడం వంటి కారణాలతో విపక్షాలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చాయి. కాగా ఈ అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందాలంటే సాధారణ మెజార్టీ అయిన 272 ఓట్లు కావాలి. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 293 సంఖ్యాబలం ఉంది. ప్రతిపక్షాలకు 238 మంది ఎంపీలు ఉన్నారు. 

చట్టాలు, నిబంధనలకు సభ్యులందరూ కట్టుబడి ఉండాలి

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు

స్పీకర్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. రాజ్యాంగం ప్రకారం చట్టాలు, నిబంధనలకు అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ కట్టుబడి ఉండాలని అన్నారు. ఏ వ్యక్తి అయినా తనను తాను అన్నింటికీ అతీతుడిగా భావించినప్పుడు, ఆయన్ని నిలదీయడం చాలా ముఖ్యం అని రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

ప్రతిపక్ష ఎంపీలను మాట్లాడనివ్వకుండా స్పీకర్ పక్షపాతం చూపుతున్నారనే ఆరోపణలు గురించి రిజిజు మాట్లాడుతూ ఏ సభ్యుడైనా సభలో మాట్లాడటానికి, సభలో ఉన్నప్పుడు స్పీకర్ దృష్టిని ఆకర్షించడానికి అనుమతించే స్పష్టమైన నియమాలు అమలులో ఉన్నాయన్నారు. అంతకుముందు అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైనప్పుడు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ప్రతిపక్షాలకు అత్యంత అంతరాయం కలిగించిన మంత్రిగా ఆయన గుర్తుండిపోతారని’ అన్నారు.

ప్రభుత్వానికి తలవంచని ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ

వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు

లోక్‌సభలో కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తన సోదరుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని గట్టిగా సమర్థించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి తలవంచకుండా నిలబడిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని ఆమె కొనియాడారు. మంగళవారం రాహుల్‌గాంధీ సభలో సత్యాన్ని సంకోచం లేకుండా మాట్లాడుతారని, ఈ వాస్తవాన్ని పాలక పార్టీ జీర్ణించుకోవడం కష్టమని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై ప్రియాంక తీవ్ర విమర్శలు చేశారు.