సూడాన్‌కు చెందిన 49 ఏళ్ల రోగికి కొత్త జీవితం
- అందించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- అత్యంత క్లిష్టమైన మూత్రపిండ మార్పిడికి శస్త్రచికిత్స
హైదరాబాద్, జూన్27(విజయక్రాంతి): సూడాన్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన, కారణం తెలియని దీర్ఘకాలిక మూత్రపిండ వైఫల్యంతో పాటు రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తీవ్రంగా తగ్గిపోవడంతో చికిత్స కోసం ఆసుపత్రిని ఆశ్రయించారు. రోగి మూత్రపిండాల వైఫల్య లక్షణాలు తీవ్రంగా ఉండటంతో వెంటనే మెయింటెనెన్స్ హీమోడయాలిసిస్ ప్రారంభించారు. అనంతరం కిడ్నీ మార్పిడి కోసం తన కుమారుడు, కుమార్తెను సంభావ్య దాతలుగా తీసుకుని వైద్యులను సంప్రదించారు.
రోగిలో మూత్రపిండాల వైఫల్యానికి గల కారణం స్పష్టంగా తెలియకపోవడంతో, మార్పిడి అనంతరం వ్యాధి తిరిగి వచ్చే అవకాశాలను నివారించేందుకు జన్యుపరమైన పరీక్షలతో సహా సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే ఇద్దరు దాతలకు కూడా విస్తృత స్థాయిలో పరీక్షలు చేశారు. పరీక్షల్లో కుమారుడికి ఇమ్యునోలాజికల్ అసమతుల్యత ఉన్నట్లు గుర్తించడంతో ఆయన్ని దాతగా పరిగణించలేదు. అనంతరం కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, కుమార్తెను కిడ్నీ దాతగా ఎంపిక చేశారు.
సీనియర్ నెఫ్రాలజిస్టులు డాక్టర్ ప్రభు చరణ్, డాక్టర్ రాజీవ్, సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ రఘువీర్, ట్రాన్స్‌ప్లాంట్ అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలోని నిపుణుల బృందం అవసరమైన అన్ని వైద్య, చట్టపరమైన అనుమతులు, కౌన్సెలింగ్ అనంతరం రోగికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది.రోగిలో రక్తనాళాల నిర్మాణం అసాధారణంగా ఉండటంతో ఈ శస్త్రచికిత్స అత్యంత క్లిష్టంగా మారినప్పటికీ, వైద్యుల బృందం అత్యంత సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేసింది.
వారిద్దరూ వేగంగా కోలుకుని, వారం రోజుల వ్యవధిలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తదుపరి ఒక నెలపాటు వైద్యుల పర్యవేక్షణలో కొనసాగిన ఫాలోఅప్‌లో ఇన్ఫెక్షన్ లేదా అవయవ తిరస్కరణ వంటి ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ప్రస్తుతం రోగి సాధారణ మూత్రపిండ పనితీరుతో సంపూర్ణ ఆరోగ్యంతో తన స్వదేశమైన సూడాన్‌కు తిరిగి వెళ్లారు.






