19 March, 2026 | 12:46 PM

విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి

19-03-2026 12:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

బెల్లంపల్లి, మార్చి 18 : పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా కేంద్రాలలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం పట్టణంలోని బజార్ ఏరియాలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి వార్షిక పరీక్షల నిమిత్తం జిల్లాలో 48 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థుల సౌకర్యార్థం త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, వెలుతురు, ఫ్యాన్లు, మూ త్రశాలలు, అత్యవసర నిమిత్తం అవసరమైన మందులు, వైద్య సిబ్బంది నియమించడం జరిగిందని, పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచడం జరుగుతుందన్నారు.

విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుం డా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని మున్సిపల్ కమిషనర్ సంపత్ తో కలిసి సందర్శించి అదనపు తరగతి గదులు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రామ్ నగర్ ప్రాంతంలో నిర్మితమవుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను సందర్శించి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

కన్నెపల్లి మండలంలో...

కన్నేపల్లి(భీమిని), మార్చి 18 : కన్నేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి వార్షిక పరీక్షల పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ బుధ వారం సందర్శించి పరీక్ష తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి పారిశుధ్య నిర్వహణ, తరగతి గదులు, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో కల్పిస్తు న్న సౌకర్యాలు, విద్యా బోధన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్.ఓ. ప్లాంట్ ను పరిశీలించి విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.