9 March, 2026 | 11:44 PM

ప్రజల్లో ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేలా అవగాహన పెంపొందించాలి

09-03-2026 09:49 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు ప్రజలు అప్రమత్తం అయ్యేలా అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం, వరదల సమయంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై ఎన్డిఆర్ఎఫ్ బృందాలు జిల్లాలో అవగాహన కల్పించనున్నాయి. ఎన్డిఆర్ఎఫ్ బృందాల అవగాహన కార్యక్రమాల నిర్వహణపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిర్మల్ పట్టణంతో పాటు, వరద ప్రభావిత మండలాలలో ముందస్తు సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఎన్డిఆర్ఎఫ్ బృందాల ద్వారా సామాజిక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. గత ప్రకృతి వైపరీత్యాల అనుభవాల దృష్ట్యా, వరదలు సంభవించే అవకాశం ఉన్న ప్రదేశాలలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.

ప్రజలకు ప్రకృతి వైపరీత్యాల పట్ల ముందస్తు అవగాహన కల్పిస్తే, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాల నుంచి బయటపడవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున ప్రజలను, స్థానిక ప్రజా ప్రతినిధులను, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, ఎన్డిఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్, లైజనింగ్ ఆఫీసర్ జగదీష్, జిల్లా అగ్నిమాపక అధికారి ప్రభాకర్, డి ఎం ఇండస్ట్రీస్ నరసింహా రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.