31 July, 2026 | 1:12 AM

గంజాయి జోలికి వెళ్లొద్దు: ఎస్‌ఐ రామకృష్ణ

31-07-2026 12:28 AM

నాగల్గిద్ద, జూలై 30: మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా నాగల్గిద్ద మండల పరిధిలోని కరస్గుత్తి గ్రామంతో పాటు పలు గ్రామాల్లో పోలీసులు గురువారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులతో సమావేశమై గంజాయి సాగు, వినియోగం, రవాణా, విక్రయం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నాగల్గిద్ద ఎస్‌ఐ రామకృష్ణ సూచించారు. గంజాయి మొక్కలను వ్యవసాయ భూముల్లో సాగు చేయడం చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గంజాయి సాగు లేదా అక్రమ రవాణాపై సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అనంతరం సంగారెడ్డి డాగ్ స్క్వాడ్ సిబ్బంది విశ్వనాథ్ ఆధ్వర్యంలో శునకంతో కలిసి గ్రామాల్లోని వివిధ దుకాణాలను తనిఖీ చేశారు. మత్తు పదార్థాల అక్రమ విక్రయాలను అరికట్టేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డాగ్ స్క్వాడ్ సిబ్బంది విశ్వనాథ్, నాగల్గిద్ద ఎస్‌ఐ రామకృష్ణతో పాటు పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.