9 March, 2026 | 11:47 PM

డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణకు ఘన సన్మానం

09-03-2026 09:52 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లను ఘనంగా సన్మానించారు. ఇటీవల డీసీసీ అధ్యక్షులకు నిర్వహించిన 10 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో పాటు సాలెగూడ సర్పంచ్ వందనలను సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మున్సిపల్ కౌన్సిలర్ అబ్దుల్లా కలిసి మహిళా నేతలను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మహిళా నాయకురాళ్లు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళలు రాజ్యాధికారంలో కీలక పాత్ర పోషించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహిళా ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.