calender_icon.png 11 February, 2026 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెల్లవార్లూ మద్యం మత్తులోనే..!

11-02-2026 11:43:16 AM

- ఓటమి టెన్షన్తో ఓటు రేటు రెట్టింపు

- తమ కులపోడి గెలుపు కోసం పార్టీలను పక్కన పెట్టిన ఉన్నత వర్గాలు

- నువ్వు ఎక్కడైనా తిరుగు.. ఓటు మావోడికే వెయ్..!

- బిజెపి పార్టీకి ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ లీడర్ ఒత్తిడి

- చర్చనీయాంశంగా ఆడియో కాల్ లీక్

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీ అభ్యర్థులు, జనరల్ స్థానాల్లో పోటీపడుతున్న అభ్యర్థులు ప్రధాన పార్టీ ముఖ్య నేతల్లోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది. అసంతృప్తిలో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచి ఓట్లు చీలి ఒక్క ఓటు కూడా అత్యంత కీలకంగా మారనుందనే భయం వెంటాడుతోంది. ఒక్క ఓటు కోసం గంటల తరబడి ఓటర్లను బ్రతిమాలుతూ కనిపిస్తున్నారు. ప్రచార ఘట్టం ముగిసిన వెంటనే డబ్బు, మద్యం, విలువైన చీరలు, వెండి కుంకుమ గిన్నెలు, బిర్యానీ పొట్లాలు వంటివి పంపిణీ చేస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సోమవారం రాత్రి నుండి మంగళవారం, బుధవారం తెల్లారే వరకు ఆయా వార్డులోని ప్రధాన పార్టీ లీడర్లు అభ్యర్థులు మందు బాటిళ్ళను మోస్తూ కనిపించారు. కులాల వారిగా గంపగుత్తగా ఓట్లను కొనుగోలు చేసేందుకు లక్షల్లో ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది అలక చెందిన వారిని బుజ్జగించేందుకు ఓటు రేటును కూడా రెట్టింపు చేస్తున్నట్లు జోరుగా చర్చ జరుగుతుంది. 

ఉన్నతవర్గల వారిని గెలిపించుకోవడం కోసం రంగంలోకి రెడ్లు.!

ఉన్నత వర్గాలకు చెందిన అభ్యర్థులు నిలుచున్నచోట్ల పార్టీలను పక్కనపెట్టి ఆ వర్గాలకు చెందిన అన్ని పార్టీల ప్రధాన రెడ్డి నేతలంతా ఒక్కటై ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు వాదన వినిపిస్తోంది. మంగళవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ లీడర్ బిజెపి పార్టీకి ఓటు వేయాలని కోరుతూ ఓటర్లకు చేసిన ఆడియో కాల్ లీక్ కావడంతో తీవ్ర దుమారం రేగుతోంది. వారిలో ఉన్న యూనిటీ బీసీల్లో లేకపోయిందా అంటూ బీసీ నేతలంతా పునరాలోచనలో పడినట్లు ఆయా వార్డుల్లో చర్చ జరుగుతుంది.

దీంతో అంచనాలు తలకిందులుగా మారే అవకాశం ఉందని జోరుగా చర్చ జరుగుతుంది. అధికార కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ టికెట్లను ఆశించి భంగపడిన స్వతంత్ర అభ్యర్థులు కూడా ఆయా పార్టీ ముఖ్య నేతలకు గట్టిగా బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో ఓట్లు చీలే విధంగా ప్రచారం చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. దీంతోపాటు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని అభ్యర్థులు మచ్చిక చేసుకుని పోల్ మేనేజ్మెంట్ కోసం యత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. యదేచ్ఛగా మద్యం డబ్బు ఇతర వస్తువులు నేరుగా అభ్యర్థులే పంపిణీ చేస్తున్నప్పటికీ సంబంధిత ఎన్నికల అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.