మురికి కూపంగా మున్సిపాలిటీ
- ‘స్వచ్ఛ’ వాహనాలు షెడ్డుకే.. వీధుల నిండా చెత్త కుప్పలే!
- ఆమనగల్లులో అస్తవ్యస్తంగా మారిన పారిశుద్ధ్యం
- వారానికోసారి కూడా రాని చెత్త ఆటోలు
- అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్న స్థానికులు
ఆమనగల్లు, జూన్ 6 (విజయక్రాంతి): పట్టణాలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ’స్వచ్ఛ భారత్’ ఆశయాలు ఆమనగల్లు మున్సిపాలిటీలో అభాసవుతున్నాయి. అధికారులు, పురపాలక వర్గం నిర్లక్ష్యం కారణంగా పట్టణంలో పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా పడకేసింది.
ప్రధాన రహదారులపై చూపే శ్రద్ధ, అంతర్గత కాలనీలపై చూపకపోవడంతో స్థానికులు ముక్కులు మూసుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యం ఇండ్ల ముందర తిరగాల్సిన స్వచ్ఛ ఆటోలు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మూలనపడి తుప్పు పడుతుంటే.. వీధులు మాత్రం చెత్త కుప్పలతో దర్శనమిస్తున్నాయి.
కాగితాల్లో వాహనాలు.. వీధుల్లో వ్యర్థాలు..
ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. పట్టణంలో నిత్యం సుమారు 5 నుంచి 6 టన్నుల చెత్త పేరుకుపోతోంది. దీనిని సేకరించడానికి 35 మంది పారిశుద్ధ్య కార్మికులు, 3 ట్రాక్టర్లు, 10 స్వచ్ఛ ఆటోలు అందుబాటులో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. వీరంతా తడి, పొడి చెత్తను వేరుగా సేకరించి కమలానగర్ లోని డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉంది.
కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పది ఆటోల్లో రెండు ఆటోలు గత ఏడాది కాలంగా పూర్తిగా చెడిపోయి మున్సిపల్ ఆఫీస్ ఆవరణలోనే మూలనపడ్డాయి. మిగిలిన వాటిలో చాలా వాహనాలకు తక్షణమే మరమ్మతులు చేయించాల్సి ఉంది. ఉన్న కొద్దిపాటి వాహనాలతోనే అరకొరగా చెత్త సేకరిస్తుండటంతో పారిశుద్ధ్య నిర్వహణ గాల్లో దీపంగా మారింది.
వారానికోసారి వస్తే.. రోగాలు రావా?
ప్రధాన రోడ్లపై మినహా, లోపలి కాలనీల్లో చెత్త సేకరణ అనేది ఒక ప్రహసనంగా మారింది. కొన్ని వార్డులకు రెండు మూడు రోజులకోసారి ఆటోలు వస్తే.. మరికొన్ని కాలనీలకు వారానికోసారి కూడా రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. చెత్తను ఇండ్లలోనే ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేక రోడ్లపైనే పారేయడంతో వీధులన్నీ చెత్త కుప్పలుగా మారుతున్నాయి.
ఈ వ్యర్థాల మధ్య పందులు, కుక్కలు స్త్వ్రరవిహారం చేస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో పాటు దోమలు ముదిరిపోయి రోగాల బారిన పడుతున్నామని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కొత్త ఆటోలను కొనుగోలు చేసి, పారిశుద్ధ్య పనులను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు.
మరమ్మతులు చేయించి ఇబ్బందులు తొలగిస్తాం:
ఆమనగల్లు మున్సిపాలిటీలో చెత్త సేకరణ ఇబ్బందులపై స్పందించిన కమిషనర్ రాఘవేందర్ రెడ్డి.. ప్రస్తుతం రెండు, మూడు స్వచ్ఛ ఆటోలకు మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉందన్నారు. వీలైనంత త్వరగా వాటికి రిపేర్లు చేయించి, పట్టణంలో చెత్త సేకరణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రాఘవేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్






