11 June, 2026 | 1:04 AM

మట్టివాసనకు దృశ్యరూపం

11-06-2026 12:00 AM

భారతీయ చలనచిత్ర రంగానికి, ముఖ్యంగా తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలకు ఎనలేని సేవలు అందించిన దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా. గ్రామీణ నేపథ్యం, మట్టి వాసన, ప్రకృతి అందాలు, సామాన్య మనుషుల భావోద్వేగాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించి న దర్శకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే, గత కొంతకాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సినీ దిగ్గజం భారతీరాజా 2026 జూన్ 10న తన 84వ ఏట కన్నుమూయడం చిత్ర పరిశ్రమలకు తీరని లోటు అని చెప్పాలి.

దక్షిణాది సినిమా చరిత్రను చూస్తే, కొం దరు సాధారణ దర్శకులుగా మాత్రమే కనిపించరు, ఒక శకాన్నే మార్చేసిన సృష్టికర్త లుగా కనిపిస్తారు. ఆ జాబితాలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు డైరెక్టర్ భారతీరాజా. ఆయనే సినిమాను స్టూడియో గోడల నుంచి పల్లెటూరి మట్టి వాసన వీచే పొలాల వైపు నడిపించిన విప్లవకారుడు. కన్నడ దర్శకుడు పుట్టన్న కనగళ్ వద్ద అసిస్టెంట్‌గా భారతీరాజా కెరీర్ ప్రారంభిం చారు. 1977లో తమిళంలో వచ్చిన ‘16 వయతినిలే’ చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు. ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. అదే చిత్రాన్ని తెలుగులో శ్రీదేవి, చం దమోహన్‌లతో ‘పదహారేళ్ల వయసు’ పేరిట రీమేక్ చేసి, ఇక్కడా భారీ విజయాన్ని అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’, ‘కొత్త జీవితాలు’, ‘ఆరాధన’, ‘జమదగ్ని’ వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. సినిమా రంగానికి ఆయన చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం, చిత్ర పరిశ్రమల నుంచి ఆయనకు ఎన్నో అత్యున్నత పురస్కారాలు లభించాయి. భారత ప్రభుత్వ ప్రతి ష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో పాటు కెరీర్‌లో మొత్తం 6 జాతీయ చలనచిత్ర అవార్డులను ఆయన అందుకున్నారు. ‘సీతాకోకచిలుక’ సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డుతో పాటు, ఆయనకు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు లభించింది. కేవలం దర్శకుడిగానే కాకుండా, పలు చిత్రాలలో వైవిధ్యమైన పాత్రల్లో నటించి నటుడిగానూ భారతీరాజా మెప్పించారు.

భారతీయ సినీ ప్రపంచంలో గ్రామీణ జీవితానికి కొత్త భాషను నేర్పిన దర్శకుడు భారతీరాజా. పల్లె అందం, అక్కడి మనుషుల స్వచ్ఛమైన ప్రేమ, వారి అనుబంధా లు, ఆనందాలు, బాధలు - భావోద్వేగాలను ఎంతో సహజంగా వెండితెరపై ఆవిష్కరించారు. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా మట్టివాసనతో నిండిన ఓ జీవనరాగంలా అనిపిస్తుంది. ప్రేమను కవిత్వంగా, బంధాలను హృద్యంగా, ప్రకృతిని పాత్రగా మలి చిన ఆయన చిత్రాలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశాయి. అందుకే భారతీరాజా కేవలం ఒక దర్శకుడు కాదు, భావో ద్వేగాలకు దృశ్యరూపమిచ్చిన ఓ గొప్ప కథకుడు కూడా. అయితే, గతేడాది కుమారు డు మనోజ్ కుమార్ హఠాన్మరణం చెందడంతో మానసికంగా ఎంతో కుంగపోయిన భారతీరాజా భౌతికంగా దూరమయ్యారు.

సహాయ దర్శకుడిగా మొదలై: 1941 జులై 17న తేని జిల్లా అల్లి నగరం గ్రామం లో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నసామి పెరియమాయ తేవర్. చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి ఉన్నప్పటికీ, సినిమారంగంలోకి ఆయన అంత సులభం గా రాలేదు. కన్నడ దర్శకుడు పుట్టణ్ణ కనగల్, పీ పుల్లయ్య వంటి దిగ్గజాల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసి సినిమాలో మెలకువలు నేర్చుకున్నారు. అలా ఆయన సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 1977లో వచ్చిన ‘16 వయతినిలే’ (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో రీమేక్ అయ్యింది) సినిమాతో భారతీయ సినీ సంప్రదాయాన్ని ఆయన తిరగరాశారు. అప్పటివరకు కేవ లం స్టూడియో సెట్టింగులకే పరిమితమైన తమిళ సినిమాను నిజమైన పల్లెటూరి లొకేషన్లలోకి తీసుకెళ్లి సరికొత్త ట్రెండ్‌కు శ్రీకా రం చుట్టారు. ఎలాంటి మేకప్ లేకుండా హీరోలను చూపించడం, ఎలాంటి అదన పు సొగసుల జోలికి వెళ్లకుండా సహజంగా ఉన్న అమ్మాయిలను హీరోయిన్లుగా పరిచ యం చేయడం ద్వారా కొత్త సంప్రదాయానికి తెరతీశారు.

తెలుగులోనూ తనదైన ముద్ర: కేవలం గ్రామీణ చిత్రాలకే పరిమితం కాకుండా, ‘సిగప్పు రోజాక్కల్’ (తెలుగులో ఎర్ర గులా బీలు) వంటి సైకో థ్రిల్లర్ చిత్రాలతో భారతీరాజా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకు న్నారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ (1981) చిత్రం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన తీసిన ‘వేదం పుదిదు’ సినిమా సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. రాధిక, రాధ, రేవతి, కార్తీక్, విజయశాంతి వంటి ఎందరో నటీనటులను ఆయనే వెండితెరకు పరిచయం చేశారు. భారతీరాజా తన సినిమాల్లో ఎక్కువగా పల్లెటూరి కథలనే చూపించేవారు. మట్టివాసనను వెండితెర పైకి తెచ్చిన దర్శకుడిగా ఆయనకు పేరుంది. హీరోయిన్లను మేకప్ లేకుండా స్వచ్ఛంగా చూపించే వారు. దీని వెనుక ఉన్న కారణా న్ని ఆయన ఓ సందర్భంలో తనదైన చతురతను జోడించి చెప్పారు. “నేను ఒకమ్మా యితో ప్రేమలో పడ్డా. ఆమెను వెతుక్కుంటూ వెళ్తుంటా. ఆశ్చర్యంగా ప్రతిసారీ ఆమె నాకు పల్లెల్లోనే కనిపిస్తోంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె ఎవరో కాదు ‘ప్రకృతికాంత’. ఆమె అందానికి ముగ్ధుడినయ్యా. అందుకే కెమెరా పట్టుకుని ఆ అందాన్ని వెతుక్కుంటా” అంటూ పల్లెలపై తన ప్రేమను వ్యక్తపర్చారు.

పురస్కారాల పంట: భారతీరాజా ప్రతిభకు ఎన్నో అవార్డులు దాసోహమ య్యా యి. ఆయన తన కెరీర్లో దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించి, ‘ఇయక్కునార్ ఇమయం (దర్శక శిఖరం)’ అనే బిరుదును పొందారు. వివిధ విభాగాల్లో మొత్తంగా 6 జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. ఇందులో తెలుగు చిత్రం ‘సీతాకో కచిలుక’కు ఉత్తమ ప్రాంతీయ చిత్ర అవార్డు కూడా ఉంది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ 2004లో భారత ప్రభు త్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. వీటితో పాటు 4 ఫిలింఫేర్ అవార్డులు, 6 తమిళనాడు రాష్ట్ర అవార్డులు, నంది అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన కేవలం దర్శకత్వానికే పరిమి తం కాకుండా నటుడిగానూ అలరించారు. ‘ఆయుధ ఎళుతు’, ‘పాండియనాడు’, ‘తిరుచి త్రంబలమ్’ (తిరు), గతేడాది వచ్చిన విజ య్ సేతుపతి ‘మహారాజా’ చిత్రాల్లో కీలకపాత్ర పోషించి మెప్పించారు. మోహన్‌లాల్ ‘తుడరుమ్’లో చివరిసారి ఆయన తెరపై కనిపించారు. అలాగే భారతీరాజా నటించిన ‘పులవర్’ చిత్రం ఇంకా విడుదల కావాల్సిఉంది. ఇదే నటుడిగా ఆయనకు చివరి సినిమా. ఒక గొప్ప దర్శకుడిని, మహా నటుడిని భారతీయ సినీ పరిశ్రమ కోల్పోయింది.

ఇస్కా రాజేష్ బాబు
9652039780