11 June, 2026 | 1:53 AM

పుట్ట మధుపై కాంగ్రెస్ నేతల సమరశంఖం

11-06-2026 12:32 AM
  1. నడిరోడ్డుపై హత్యలు జరినప్పుడు రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని ఎందుకు తిరుగులేదు 
  2. ప్రజాస్వామ్య వ్యవస్థ పై విలువలు కలిగి ఉండాలి
  3. మంత్రి శ్రీధర్ బాబును విమర్శిస్తే ఇక సహించేది లేదు
  4. మంథని లో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్ 

మంథని, జూన్ 10 (విజయ క్రాంతి): రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం మంథని లో మంత్రి క్యాంపు కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులు పుట్ట మధుపై నిప్పులు చెరిగారు.

శ్రీధర్ బాబును విమర్శించే స్థాయి నీది కాదు

ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్ మాట్లాడుతూ, పుట్ట మధు తన మాట తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పై విలువలు కలిగి ఉండాలని, మంగళవారం ‘రామగుండం కమిషనరేట్ వద్ద హంగామా చేస్తూ మా నాయకుడు శ్రీధర్ బాబుపై, పోలీసులపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు. 

మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారి కల్వచర్ల వద్ద నడిరోడ్డుపై హత్యలు జరిగినప్పుడు రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని ఎందుకు తిరుగలేదని మధును ప్రశ్నించారు. నీ అల్లుడు బిట్టు శ్రీను మర్డర్ కేసులో జైలుకు వెళ్ళినప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఎందుకు కమిషనరేట్ ముట్టడించలేదు?‘ అని నిలదీశారు. నీ మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఆయన స్పష్టం చేశారు.

మా సహనాన్ని పరీక్షించకు

‘మా నాయకుడు శ్రీధర్ బాబు దిశానిర్దేశం చేస్తున్నారు కాబట్టే మేము ఓపికగా, శాంతంగా ఉన్నాం. మేము ఒక్క సైగ చేస్తే నీ రూపరేఖలు లేకుండా పోతాయి, ఇది గుర్తు పెట్టుకో పుట్ట మధు! నేను కూడా మంథని మున్నూరు కాపు బిడ్డనే,‘ అని ప్రసాద్ సవాల్ విసిరారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ హయాంలో గెలిచిన వారం రోజుల్లోనే తమ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై దాడులు చేయించిన విషయాన్ని మధు మర్చిపోయారా అని ప్రశ్నించారు.

ఈ సమావేశంలో మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, ఎలక్ట్రిసిటీ బోర్డు మెంబర్ శశిభూషణ్ కాచే, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, వ్యవసాయ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, సర్పంచ్ ఆర్ల నాగరాజు, సీనియర్ నాయకులు ఎరుకల ప్రవీణ్, మాజీ చైర్మన్ అజీమ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పోలు శివ, ఆర్టీఏ మెంబర్ మంథని సురేష్, యూత్ కాంగ్రెస్ నేతలు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు పాల్గొన్నారు.