సాదా బైనామకు మోక్షం లభించేనా..?
కరీంనగర్, జూన్10 (విజయ క్రాంతి): తెలంగాణలో ’సాదాబైనామా’ (తెల్లకాగితాలపై భూముల కొనుగోలు ఒప్పందాలు) క్రమబద్ధీకరణ దశాబ్దాలుగా రైతులను వేధిస్తోంది. కరీంనగర్ జిల్లాలో కూడా లక్షల ఎకరాలకు అఫిడవిట్ నిబంధనలు, మునుపటి యజమానుల స్పందన లేకపోవడం వల్ల ఈ దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయి. తాజా గతంలో కొన్నవారు, అమ్మిన ఇద్దరి అఫిడవిట్లు కావాలనే నిబంధన ఉండేది. దీనివల్ల సమస్యలు రావడంతో ప్రభుత్వం దానిని సవరించింది. ఇప్పుడు భూమి కొనుగోలు చేసిన వ్యక్తి అఫిడవిట్ సమర్పిస్తే సరిపోతుంది.
ఈ ప్రక్రియను రెవెన్యూ డివిజనల్ అధికారి పర్యవేక్షిస్తున్నారు. తహసీల్దార్లు క్షేత్రస్థాయి విచారణ చేపట్టి, సరిహద్దు రైతుల వాంగ్మూలాలు సేకరించి ఆర్డీవోకు పంపుతారు. ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే భూ భారతి పోర్టల్లో హక్కులను నమోదు చేసి పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తారు. అయితే సరళీకరణ చేసినప్పటికీ దరఖాస్తుల కు మోక్షం లభించక పోవడం, ప్రజావాణిలో కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తుండటంతో జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా సమీక్ష నిర్వహించారు.
వేగవంతంగా సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలి:- జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా
పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలి. సీసీఎల్‌ఏ మార్గదర్శకాల మేరకు సాదాబైనామా దరఖాస్తులు, రికార్డులు, సంబంధిత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హత కలిగిన వాటిని త్వరితగతిన పరిష్కరించాలి. రైతులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.






