11 June, 2026 | 1:03 AM

కబ్జా చేద్దాం..! అడిగితే చూద్దాం..!!

11-06-2026 12:00 AM

పంట పొలాలకు వెళ్లే దారిని మాయం చేస్తున్న ఘనులు

కనుమరుగవుతున్న నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పెద్ద డొంక రోడ్డు

బూర్గంపాడు, జూన్ 10 (విజయక్రాంతి): పంట పొలాలకు వెళ్లే దారిని సైతం కబ్జా చేస్తున్నారు కొందరు ఘనులు. అడిగితే చూద్దాంలే అనే తీరులో ఉంది వారి పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలోని పెద్ద డొంక రోడ్డు ఆక్రమణకు గురవుతోంది.

ఒకప్పుడు వందలాది మంది రైతుల రాకపోకలకు, పశువుల మేతకు, ఎడ్లబండ్ల రవాణాకు జీవనాడిగా నిలిచిన ‘పెద్ద డొంక రోడ్డు’ నేడు కబ్జాదారుల కబంధహస్తాల్లో చిక్కుకొని ఊపిరి పీల్చుకోలేక పోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పెద్ద డొంక రోడ్డు సుమారు 400 గొలుసుల పొడవునా ఆక్రమణలకు గురవుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

కనుమరుగవుతున్న చరిత్ర..

సుమారు 60 ఏళ్ల క్రితం నాటి ఈ డొంక రోడ్డు కేవలం దారి మాత్రమే కాదు, నాగినేనిప్రోలు - రెడ్డిపాలెం గ్రామాల మధ్య రైతుల జీవనరేఖ. దశాబ్దాల క్రితం వెడల్పుగా ఉన్న ఈ బాట, నేడు ఎటు చూసినా ఆక్రమణల వల్ల కుంచించుకుపోయి, చిన్నపాటి దారిగా మారిపోయింది. కబ్జాదారులు తమ సొంత ప్రయోజనాల కోసం ప్రజా ఆస్తిని మింగేస్తున్నా, అడ్డుకునే నాథుడే కరువయ్యారు.

అధికారుల నిర్లక్ష్యం.. రైతుల ఆవేదన:

ఈ ప్రాంత రైతులు ఎన్నోసార్లు అధికారులకు మొర పెట్టుకున్నా, ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో సర్వే చేసిన దాఖలాలు లేవు. సర్వే శూన్యం దారి ఆక్రమణపై ఫిర్యాదులు చేసినా, సంబంధిత అధికారులు కనీసం వచ్చి పరిశీలించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చర్యల జాడే లేదని, కబ్జా చేస్తున్నది ఎవరు? ఎంతవరకు ఆక్రమణ జరిగింది? అనే అంశాలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల పనితీరుపై అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ డొంక రోడ్డు కనుమరుగైతే, భవిష్యత్తులో చిన్న, సన్నకారు రైతులు తమ పొలాలకు వెళ్లడం అసాధ్యంగా మారుతుందని, రాబోయే తరాలు సాగుకు దూరమవుతాయని రైతులు భయాందోళన చెందుతున్నారు.

కలెక్టరుకు విజ్ఞప్తి..

ఇది ప్రజా ఆస్తి, దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, తక్షణమే ఒక ప్రత్యేక బృందాన్ని పంపి పకడ్బందీగా సర్వే చేయించాలని వారు కోరుతున్నారు.

ఆక్రమణకు గురైన దారిని గుర్తించి, అక్రమ నిర్మాణాలను,ఆక్రమణలను తొలగించాలని,డొంక రోడ్డుకు స్పష్టమైన సరిహద్దులు ఏర్పాటు చేసి, భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలు జరగకుండా చూడాలని,ప్రజా అవసరాల కోసం ఉద్దేశించిన ఈ మార్గాన్ని తిరిగి ప్రజలకు, రైతులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, ప్రజా ఆస్తులను కాపాడటంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి, నాగినేనిప్రోలు డొంక రోడ్డును పునరుద్ధరిస్తారో లేదో వేచి చూడాలి.

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల జాప్యం ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందో చెప్పడానికి ఈ డొంక రోడ్డే నిదర్శనం. ఆక్రమణకు గురైన రోడ్డును స్వాధీనం చేసుకొని తమ వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు మార్గం చూపాలని, మండలాధికారులు, జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు. దీనిపై స్థానిక తహశీల్దార్ కెఆర్ కె వి ప్రసాద్ ను వివరణ కోరగా రైతుల దారి సమస్య మా దృష్టికి వచ్చిందని,సర్వే చేయించి దారి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.