ఏడాదిలో మేడిగడ్డ మరమ్మతులు పూర్తి
- ప్రాజెక్టు పనులు కావాలనే బీఆర్‌ఎస్ నిర్లక్ష్యం చేసింది
- తప్పుడు నిర్ణయాలతో కాలయాపన
- నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- మేడిగడ్డ పునరుద్ధరణ పరీక్షల పనుల పరిశీలన
మేడిగడ్డ (మహబూబాబాద్), జూన్ 10 (విజయక్రాంతి): మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతు పనులను 2027 జూలై నాటికి పూర్తిచేసి సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం నిర్వహిస్తున్న పరీక్షల పనులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. 2014 కంటే ముందే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహితచేవెళ్ల ప్రాజెక్టును రూ.38 వేల కోట్లతో చేపట్టినట్లు గుర్తు చేశారు. అందులో భాగంగానే దాదాపు రూ.11 వేల కోట్ల విలువైన పనులు పూర్తి కాగా దాదాపు 30 శాతం పని జరిగిందని వెల్లడించారు. 2014 తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో ఏర్పడిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం కావాలనే ప్రాజెక్టు డిజైన్ మార్పుచేసి మేడిగడ్డ ప్రాజెక్ట్ రూపకల్పన చేశారని విమర్శించారు.
16.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టు పనులను కావాలనే గత ప్రభుత్వ నిర్లక్ష్యం చేసిందని, తప్పుడు నిర్ణయాలతో ప్రాజెక్టు పనులను కాలయాపన చేశారని ఆరోపించారు. దాదాపు రూ.1,45,000 కోట్లతో మేడిగడ్డ బ్యారేజీ పనులు చేపట్టారని, బ్యారేజీ లోపభూయిష్టమైన నిర్మాణం వల్ల కుంగిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు కుంగడానికి గల కారణాలను లోతుగా విశ్లేషణ చేసేందుకు సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్‌ఏ వంటి ప్రతిష్టాత్మకమైన అనుభవం కలిగిన సంస్థలచే పరీక్షలు చేయిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
సాంకేతికంగా అత్యంత పకడ్బందీ పరీక్షలు నిర్వహించి ప్రాజెక్టు వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తెలిపారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీ మరమ్మతులు పనులు చేపట్టినట్లు చెప్పారు. పునరుద్ధరణ పనులు చేయడానికి డిసైడ్ అండ్ డిజైన్ కన్సల్టెంట్‌గా ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఆఫ్రీన్ అనే కంపెనీని సంప్రదించి ఐఐటీ బాంబే నిపుణులతో సంయుక్తంగా రీ డిజైన్ చేపట్టేందుకు పనులు చేస్తున్నారని తెలిపారు.
ఎన్డీఎస్‌ఏ పరీక్షలు నిర్వహిస్తూ ఉపయోగవంతంగా ముందుకెళుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు గానీ, జూలై మొదటి వారం వరకు అన్ని పరీక్షలు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. పరీక్షలు నివేదిక ఆధారంగా బ్యారేజ్ పునరుద్ధరణ డిజైన్ చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. డిజైన్ సిద్ధం చేసిన తర్వాత సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్‌ఏ అనుమతి తీసుకొని ఈ వర్షాకాలం పూర్తి కాగానే నవంబర్, డిసెంబర్ నెలల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
2027 ఎండాకాలం వరకు పనులు పూర్తిచేయడానికి లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి భారత సైన్యంలో అత్యంత నైపుణ్యం అత్యంత అనుభవం కలిగిన కల్నల్ పరిషిత్ మెహ్రా చైర్మన్ ఆధ్వర్యంలో ముందుకుపోతున్నట్లు తెలిపారు. కమిటీలో చాలామంది దేశ విదేశాల నుంచి నిపుణులను పెట్టి ఈ పరీక్షలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పునరుద్ధరణ పనులు ప్రారంభించడానికి ముందే ప్రతి బ్యారేజీ నాణ్యత తనిఖీ చేస్తూ సమస్యలు ఉంటే మరమ్మతులు చేసేందుకు కార్యచరణ చేపట్టనున్నట్లు తెలిపారు.
మంత్రి వెంట భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఇరిగేషన్ సెక్రెటరీ శ్రీధర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సీఈ శ్రీనివాస్‌గుప్తా, ఆర్డీవో రవీందర్, ఇరిగేషన్ ఎస్‌ఈ దస్తగిరి, ఈఈ రమేష్, కన్సల్టెంట్ ఈఈ యాదగిరి, గ్రంథాలయ చైర్మన్ రాజబాబు, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో సురేందర్ ఉన్నారు.






