11 June, 2026 | 2:13 AM

నామినేషన్ తిరస్కరణ బీజేపీ కుట్ర

11-06-2026 01:00 AM

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి) : మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ కుట్ర ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను తమకు అనుకూలంగా మలుచుకోవడం ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తుందన్నారు. ఈ మేరకు  ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మొన్నటి వరకు ఓట్ల చోరీకి పాల్పడిన బీజేపీ.. ఇప్పుడు సీట్ల చోరీకి సిద్ధమైందని విమర్శించారు.

రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతిపక్షాలపై కుట్రలు చేయడం బీజేపీ బలహీనతకు నిదర్శనమన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రత దెబ్బతింటోందని, ఎన్నికల కమిషన్‌ను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరమన్నారు.

మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు గల కారణాలను స్పష్టంగా ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. సాంకేతిక కారణాల పేరుతో ప్రతిపక్ష అభ్యర్థులను ఎన్నికల బరిలో నుంచి తప్పించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ర్రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్నారు.