11 June, 2026 | 2:14 AM

బీజేపీ రాజ్యసభలో సీటు చోరీకీ పాల్పడ్డది

11-06-2026 12:59 AM
  1. మా ప్రభుత్వంలో మీనాక్షిపై ఎలా కేసు అవుతుంది
  2. న్యాయస్థానంలో పోరాటం చేస్తాం
  3. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ, జూన్ 10 (విజయక్రాంతి): ఓటు చోరీ తరహాలోనే బీజేపీ రాజ్యసభలో సీటు చోరీకి పాల్పడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలో పలు అభివృద్ధి పనుల ప్రారంభించిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీట్ చోరీతో తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ని అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. మా ప్రభుత్వం ఏర్పడినప్పుడే మీనాక్షి రాష్ట్ర ఇన్‌చార్జిగా ఉన్నారని మా ప్రభుత్వంలో ఆమెపై ఎలా కేసు అవుతుందని మంత్రి ప్రశ్నించారు.

తమిళనాడులో పుట్టినప్పటికీ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన క్రమంలో బీజేపీ కుట్ర చేసి సీటు చోరీకి పాల్పడిందన్నారు. నామినేషన్ తిరస్కరణను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్‌ని పార్టీ పెద్దలు కలిశారని, ఈ విషయంపై కోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు. మీనాక్షి నటరాజన్ జీవితాన్ని పార్టీకి అంకితం చేసిన నిజాయితీ గల నాయకురాలన్నారు.

రాజ్యసభలో కాంగ్రెస్‌కు తగిన బలం ఉన్నప్పటికీ, రాజకీయ కుట్రలతో ఆమెను అనర్హురాలిగా ప్రకటించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదనీ, నిజాయితీగా ప్రజాసేవ చేస్తున్న నాయకురాలిని రాజకీయ కుట్రలతో అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.