రబీలో బుక్ చేస్తే .. ఖరీఫ్‌లో రమ్మన్నారు
వానాకాలంలో వెళ్తే మళ్లీ బుక్ చేయాలంటున్నారు
దేమే విండో అధికారులు తీరు
ఓ రైతుకు యూరియా కోసం వెళ్తే వింత షాక్
కామారెడ్డి, జూన్ 10 (విజయక్రాంతి): యూరియా కష్టాలు రైతులను విడడం లేదు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా యాప్లో యూరియా కోసం బుక్ చేసుకుంటే ప్రతి రైతుకు యూరియా అందిస్తామని ప్రభుత్వ అధికారులు ఒకవైపు చెపుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు.
గత ఖరీఫ్ సీజన్లో యూరియా కోసం యాప్ లో నమోదు చేసుకున్న కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మాజీ వాడి గ్రామానికి చెందిన భాస్కర్ అనే రైతు యూరియా కోసం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమే సింగిల్ విండో కార్యాలయానికి వెళితే ఈ వింత షాక్ ఎదురైంది.
యూరియా కోసం రబీ సీజన్లో యాప్ లో ఐదు యూరియా బస్తాల కోసం నమోదు చేసుకున్న రైతు భాస్కర్ కు సింగిల్ విండో కార్యాలయానికి రబీ సీజన్లో వెళ్లిన ఇప్పుడు యూరియా స్టాక్ లేదని వర్షాకాలంలో ముందుగానే వస్తే ఇస్తామని నచ్చజెప్పి పంపించారు. నిజమే అని నమ్మి వెళ్లిన రైతు బుధవారం వానకాలం పంటకు యూరియా కోసం వెళ్లగా విండో కార్యాలయం అధికారులు షాక్ చెప్పారు. ఈసారి యాప్ లో నమోదు చేసుకుంటేనే యూరియా అందిస్తామని తేల్చి చెప్పారు. దీంతో రైతు నిర్గాంత పోయారు.
గత రబీలో యాప్ లో యూరియా కోసం నమోదు చేస్తే ఆ సీజన్లో ఇవ్వకుండా వర్షాకాలం సీజన్లో ఇస్తామని చెప్పిన అధికారులు ఈ సీజన్ లో వెళ్తే మళ్ళీ యాప్ లో నమోదు చేసుకోవాలని చెప్పారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒక్క రైతు కథ అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో రైతులు వర్షాకాలం పంటల కోసం యూరియా కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. యాప్ నమోదు చేసుకున్న వారి కష్టాలు ఒక తీరైతే యాప్లు నమోదు చేసుకోకుండా అధికారులతో మీలాకత్ అయిన వారికి యాప్ లో నమోదు చేసుకోకుండా యూరియా బస్తాలను కట్టబెట్టారు.
దీంతో నిజాయితీగా యాప్ లో నమోదు చేసుకున్న రైతులకు యూరియా అందడం లేదు. రెండు రోజుల క్రితం సదాశివ నగర్ మండలం పద్మాజీ వాడి విండోలో యాప్ లో నమోదు చేసుకున్న యూరియా బస్తాలు ఇవ్వలేదని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం విధితమే. జిల్లాలో చాలా విండోలలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం ఆశించిన ఆశయం తుంగలో తొక్కి వారికి అనుకూలమైన రైతులకు మాత్రం యూరియా బస్తాలను అందిస్తున్నారు. నిజాయితీగా ఉన్న రైతులకు యూరియా కోసం ఇబ్బందులు తప్పడం లేదు.
ప్రతిరోజు యూరియా కోసం రైతులు క్యూలో నిలబడడం చివరికి సాయంత్రం వరకు వేచి చూసిన వారికి యూరియా బస్తాలు అందడం లేదు. దీంతో వెను తిరుగుతున్నారు. యూరియా కష్టాలు రైతులకు ఉండవద్దని ఉద్దేశంతో ప్రభుత్వం యాప్ పద్ధతిని అమల్లోకి తెచ్చింది. కొంతమంది నిరక్షరాస్యులైన రైతులకు యాప్ లో నమోదు చేయడం రాకపోవడంతో యూరియా బస్తాలు సకాలంలో అందడం లేదు. రోజు ఒక చోట వింత ఘటనలు యూరియా కోసం వెలుగు చూస్తున్నాయి. నిజాయితీగల రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
యూరియా అవసరమైన రైతులకు వెంటనే అందించాలని రైతులు కోరుతున్నారు. అధికారులు మాత్రం స్టాక్ వచ్చినంత పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారు. రైతులు మాత్రం యూరియా కోసం ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అసలైన రైతులకు యూరియా అందించాలని కోరుతున్నారు. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల యూరియా కోసం రైతులు రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం పై చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.






