25 May, 2026 | 6:08 AM

సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేద్దాం

25-05-2026 12:34 AM

కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్సీ దండే విఠల్ పిలుపు

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 24 (విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పిలుపునిచ్చారు. దహెగాం మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు. పర్యటనలో భాగంగా జూన్ 2న ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడత ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని, పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరారు. సభ నిర్వహణ, ప్రజల తరలింపు, ప్రచార కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ముఖ్యమంత్రి పర్యటన జిల్లాలో అభివృద్ధికి కొత్త ఊపు తీసుకురానుందని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు మరింత బలం చేకూరుతుందని ఎమ్మెల్సీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.