ముందే గుర్తించాం
- హైకోర్టు భవన పనుల్లో అవకతవకలు వాస్తవమే
- ఇప్పటికే సంబంధిత అధికారులకు నివేదించాం
- అయినా.. ఫలితం శూన్యం
- పనులు కొనసాగితే అంచనాలు తలకిందులు
- ముందనుకున్న బడ్జెట్ కంటే రూ.౫ వేల కోట్లు పెరిగే అవకాశం
- టీం వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్పష్టీకరణ
- ఆర్‌అండ్‌బీ సీఈకి లేఖ ద్వారా వివరణ
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): రాష్ట్ర హైకోర్టు నూతన భవన సముదా య నిర్మాణంలో అవకతవకలు నిజమే.. ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు బడ్జెట్ అంచనాలు తలకిందులవుతాయని, టెండర్ విలువ నుంచి రూ.5,000 కోట్లకు చేరే అవకాశం ఉందని ప్రాజెక్టు కన్సల్టెన్సీ సంస్థ టీం వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్పష్టం చేసింది. రాజేంద్రనగర్‌లో నూతనంగా చేపట్టిన హైకోర్టు భవన సముదాయం నిర్మాణంలో అనేక అవకతకలు జరిగాయంటూ ‘మెట్రో ఇండియా’ ఆంగ్ల పత్రిక ఈనెల 14న వార్తా కథనాన్ని ప్రచురించింది.
దీనిపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజినీర్ (సీఈ) జీ రాజే శ్వర్‌రెడ్డి కార్యాలయం నుంచి వచ్చిన రిజాయిండర్ (ఖండన)ను కూడా సదరు ఆంగ్ల పత్రిక ఈనెల 19వ తేదీన ప్రచురించింది. ఇందులో టీం వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌దే ప్రధాన బాధ్యత అని, ఆ సంస్థ తప్పు చేసిందనేలా ఖండన ఉండటంతో సదరు కన్సల్టెన్సీ స్పందిస్తూ ఈ నెల 21న ఆర్‌అండ్‌బీ సీఈకి లేఖ రాసింది. హైకోర్టు భవన సముదాయం నిర్మాణంలో తాము గుర్తించిన అవకతవకలు, వాటి ప్రభా వాన్ని కన్సల్టెన్సీ సంస్థ లేఖ ద్వారా తేటతెల్లం చేసింది.
లేఖలో ప్రస్తావించిన అంశాలు..
టీమ్ వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను 1992లో స్థాపించారు. ప్లానింగ్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ కోఆర్డినేషన్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ విషయంలో సంస్థకు అపారమైన అనుభవం, నైపుణ్యం ఉంది. 50 అంతస్తులకు పైగా బహుళ అంతస్తుల భవనాలు, సాంకేతికంగా సవాలుతో కూడుకున్న ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన అనుభవం తమకు ఉంది. దీంతో టీమ్ వన్ సంస్థ ఇండియా దేశంలోని ప్రముఖ, అత్యంత విశ్వసనీయమైన ఆర్కిటెక్చరల్ కన్సల్టెన్సీ సంస్థల్లో ఒకటిగా ఎదిగిందని లేఖలో వివరించారు.
రాష్ట్ర నూతన హైకోర్టు భవన సముదాయ నిర్మాణానికి సంబంధించి జాతీయస్థాయి పోటీలో తమకు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ దక్కింది. ఈ ప్రాజెక్టు ఒప్పందం ప్రకారం.. హైకోర్టు భవన సముదాయానికి సంబంధించి ఆర్కిటెక్చరల్ డిజైన్ (భవన నమూనా), స్ట్రక్చరల్ డిజైన్ (నిర్మాణ నమూనా), ఎంఈపీ (మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్) సేవలు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, పర్యవేక్షణ సేవలు, బిల్ ధృవీకరణ సేవలు, ల్యాండ్‌స్కేప్ డిజైన్, టెండర్ పత్రాల తయారీ, అంచనాలతో పాటు ఇతర అంశాలను చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
జాగ్రత్తగా రూపొందిస్తున్నాం..
ఈ ప్రాజెక్టు విషయంలో తమ బృందం (టీం వన్ ఇండియా ప్రై. లి) అంకితభావం, నిజాయితీ, నిరంతర శ్రమతో పనిచేస్తోందని, డిజైన్‌కు సంబంధించి ప్రతి దశను ఎంతో జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా, సమన్వయం, కఠోర శ్రమతో రూపొంది స్తున్నామని లేఖలో తెలిపారు. ఈ లేఖతో పాటు జతపరిచిన డిజైన్ రెండర్స్ అన్నీ కూడా ప్రాజెక్టును అత్యున్నత నాణ్యతతో నిర్మించడానికి తమ బృందం చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు నిదర్శనంగా పేర్కొంది.
రాబోయే 12 నుంచి 18 నెలల వరకు నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా, నిర్మాణానికి సిద్ధంగా ఉన్న డ్రాయింగులను తాము ఇప్పటికే సమర్పించినట్లు వివరించారు. కన్సల్టెంట్ సంస్థ డ్రాయింగులను అందించలేదంటూ వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి, అవాస్తవం అంటూ కన్సల్టెన్సీ స్పష్టం చేసింది. ఎటువంటి అంతరాయం కలగకుండా, పనులు సజావుగా సాగడానికి, ప్రాజెక్ట్ అవసరాలకు అనుగుణంగానే డ్రాయింగులు సిద్ధం చేసి అందించామని, పలు బ్లాకులకు సంబంధించి ఇప్పటికే దాదాపు 90 శాతం అవసరమైన డ్రాయింగులను సమర్పించామన్నారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్..
ప్రాజెక్ట్ నిర్మాణంలో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలను కాంట్రాక్టర్ సరిగ్గా పాటించడం లేదని కన్సెల్టెన్సీ గమనించిందని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు క్వాలిటీ కంట్రోల్ నివేదికల ద్వారా రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖ దృష్టికి తీసుకువెళ్లామని, ఈ వ్యవహారాలను హైకోర్టు బిల్డింగ్ కమిటీకి కూడా తెలియజేశామని సంస్థ పేర్కొంది.
లీడ్ డిస్టెన్స్ పెంచారు..
టెండర్ నిబంధనల ప్రకారం, ఒక కిలోమీటరు లీడ్ డిస్టెన్స్ (రవాణా దూరం) కోసం వర్తించే ధరను నిర్ణయించారని, అయితే ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా లీడ్ డిస్టెన్స్‌ను 22 కిలో మీటర్లకు పెంచాలని ఆర్‌అండ్‌బీ అధికారులు సూచించారు. దీనివల్ల ప్రాజెక్ట్ మొత్తం వ్యయం పెరిగిందని సంస్థ పేర్కొంది. దీని ఫలితంగా, కాంట్రాక్టర్ టెండర్‌లో పేర్కొన్న ధరల కంటే చాలా ఎక్కువ మొత్తాలను క్లెయిమ్ చేశారు. అంతేకాకుండా కాంట్రాక్టర్ విలువ కలిగిన మెటీరియల్‌ను విక్రయించారని, దానికి సంబంధించిన మొత్తాన్ని వారి బిల్లు నుంచి మినహాయించాల్సి ఉందని సంస్థ లేఖలో తెలిపింది.
సమాచారం లేకుండానే తొలగించారు
పారదర్శకత, నాణ్యత, ప్రాజెక్ట్ సమగ్రత ప్రయోజనాల దృష్ట్యా తాము గుర్తించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అయినప్పటికీ సంస్థ చేయాల్సిన పని పరిధిలోని కొన్ని భాగాలను ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసు లేదా వివరణ ఇచ్చే అవకాశం లేకుండానే డీ-శాంక్షనింగ్/డీ-స్కోపింగ్ (తొలగించడం) చేశారు. ప్రాజెక్టులో నివారించే వ్యత్యాసాలు, వ్యయ పెరుగుదల, నాణ్యత విషయంలో రాజీ పడకుండా.. ప్రాజెక్టును రక్షించడానికి మాత్రమే మేము ఈ విషయాలను లేవనెత్తాం. కానీ , అధికారుల చర్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇండిపెండెంట్ ఇంజనీర్ నియామకం
ఇదే సమయంలో ఇండిపెండెంట్ ఇంజనీర్‌గా ఆర్వీ సంస్థను నియమించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నియామకం కోసం ఎటువంటి ఓపెన్ టెండర్ ప్రక్రియను అనుసరించినట్లు కనిపించడం లేదు. కేవలం ఒక కొటేషన్ ఆధారంగానే ఈ నియామకం జరిగినట్లు తెలుస్తోంది. ఇది నియామక ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికత, న్యాయబద్ధతపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తోంది.
నిరంతరం చెబుతూనే ఉన్నాం
ప్రాజెక్ట్ అమలు సమయంలో ప్రతిపాదించిన ప్రతీ మార్పును, దానితో ముడిపడిన వ్యయ ప్రభావాన్ని మేము నిరంతరం చెబుతూనే ఉన్నాం. ముందస్తు నోటీసులు జారీ చేస్తూ మా వృత్తిపరమైన బాధ్యతను సక్రమంగా నిర్వహించాం. ప్రాజెక్ట్ నిర్మాణం ప్రజాధనంతో కూడుకున్నందున.. పారదర్శకత, సాంకేతిక, ఆర్థిక క్రమశిక్షణతో ప్రతి దశలోనూ మా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశాం. ఇటువంటి సవరణల వల్ల అదనపు పరిమాణాలు ప్రాజెక్టుపైై ఆర్థిక ప్రభావం పడుతుందని కూడా మేము నొక్కి చెప్పాం.
సవరించిన డ్రాయింగులపై ఐఐటీ సమీక్ష, ఆమోదం
ఆర్‌అండ్‌బీ ఇంజనీర్ల నుంచి వచ్చిన ఆదేశాల ఆధారంగా సవరించిన డ్రాయింగులను సమీక్ష కోసం ఐఐటీకి పంపించాం. వీటిని ఐఐటీ సమీక్షించి ఆమోదించింది. అయితే ప్రాజెక్టు వ్యయంలో తేడాను, నిర్మాణ పనుల్లో వ్యత్యాసాలను తాము సంబంధిత అధికారుల దృష్టికి ముందస్తుగానే తీసుకువెళ్లామని, నిబద్ధత కోణంలోనే తమను చూడాలని సంస్థ విన్నవించింది.
ముఖ్యమంత్రి సంకల్పం మేరకు..
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో హైకోర్టు నూతన భవనం అనేది ప్రతిష్టాత్మకంగా, ల్యాండ్‌మార్క్ ప్రాజెక్టుగా 2027 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారని కన్సల్టెన్సీ సంస్థ పేర్కొంది. ఈ డ్రీమ్ ప్రాజెక్టుకు ఉన్న ప్రాముఖ్యతను తాము పలు సందర్భాల్లో నిర్వహించిన సమావేశాలకు హాజరై అర్థం చేసుకున్నాం. రాబోయే తరాలకు ఐకానిక్‌గా, శాశ్వతంగా నిలిచిపోయే ప్రభుత్వ సంస్థగా హైకోర్టు భవన సముదాయాన్ని నిర్మించాలనే సంకల్పం వెనుక ఉన్న మహోన్నత ఉద్దేశ్యాన్ని గుర్తించినట్టు సంస్థ లేఖలో పేర్కొంది.
కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోలేదు
ఈ నేపథ్యంలోనే సైట్‌లో పనులు నిరంతరాయంగా సాగేలా చూడటం, ఆమోదించిన డ్రాయింగులను కచ్చితంగా పాటించడం, అనవసరమైన వ్యత్యాసాలను నివారించడం, కాంట్రాక్టర్ షెడ్యూల్, స్పెసిఫికేషన్లతో పాటు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పనులు సాగేలా దృష్టి పెట్టాలని తాము నిబద్ధతతో సలహా ఇస్తున్నట్టు సంస్థ పేర్కొంది. రెండు నెలలుగా పనులు చాలా వరకు నిలిచిపోయాయి. కాంట్రాక్టరు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ కన్సల్టెన్సీ లేఖలో పేర్కొంది.
మా అభిప్రాయాలను తెలియజేసే అవకాశం ఇవ్వలేదు
ఆర్‌అండ్‌బీ శాఖ కార్యాలయం రిజాయిండర్ జారీ చేయడానికి ముందు మా అభిప్రాయాలు, వివరణలను తెలియజేసే అవకాశం తమకు ఇవ్వలేదని కన్సల్టెన్సీ సంస్థ టీం వన్ ఇండియా ప్రై.లి స్పష్టంగా పేర్కొంది. ఈ లేఖతోపాటు కన్సల్టెన్సీ సంస్థ వెలిబుచ్చిన అభిప్రాయాలు, అంశాలను నిర్ధారించే కొన్ని పత్రాలు, ఛాయాచిత్రాలు జతచేసినట్టు లేఖలో పేర్కొంది.
ప్రధాన వ్యత్యాసాలు..
* ప్రాజెక్టు అమలులో కేవలం మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే పలు ప్రధాన వ్యత్యాసాలు గమనించామని, దీనివల్ల ఆమోదించిన టెండర్ నిబంధనలు, డిజైన్‌లలో గణనీయమైన మార్పులు వచ్చాయని కన్సల్టెన్సీ స్పష్టంచేసింది.
* ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ టెండర్‌లో నిర్దేశించిన 75/100 ఎంఎం మందానికి బదులుగా 150 ఎంఎం మందంతో పనులు నిర్వహించి, అదనపు పరిమాణంలో క్లెయిమ్ చేశారు.
* గ్రేడ్ స్లాబ్ మందం ఆమోదించిన 125 ఎంఎంకు బదులుగా 175 ఎంఎంకు పెంచి క్లెయిమ్ చేశారు.
* ప్రాజెక్టు సైట్‌లో సాయిల్ బేరింగ్ కెపాసిటీ (ఎస్‌బీసీ) వాస్తవ సామర్థ్యం స్కేర్ మీటర్‌కు 70 నుంచి -100 కంటే ఎక్కువ టన్నులు ఉన్నదని నిర్ధారించినప్పటికీ.. దానిని 40 నుంచి -50 టన్నులకే పరిమితం చేశారు. దీనివల్ల పునాదుల డిజైన్ పెరిగి, తద్వారా ఖర్చులు పెరగడానికి కారణమైంది.
* టెండర్ నిబంధనలలో పేర్కొన్న ఫ్లువుడ్ షట్టరింగ్‌కు విరుద్ధంగా.. అల్యూమినియం షట్టరింగ్‌ను క్లెయిమ్ చేశారు.
* టాప్ రీఇన్ఫోర్స్మెంట్ సపోర్టింగ్ చైర్స్ పని కాంట్రాక్టర్ చేయాల్సిన వాటి పరిధిలోకి వస్తున్నప్పటికీ, వేరే పేరుతో మార్చి, విడిగా దాదాపు 550 మెట్రిక్ టన్నుల స్టీల్‌ను క్లెయిం చేశారు.
* పార్కింగ్ బే గ్రిడ్‌ను 2/3 బేల నుంచి 4 బేలకు మార్చారు. దీనివల్ల పోస్ట్ స్లాబ్ సిస్టమ్‌కు మారాల్సి వచ్చింది. దీని కారణంగా బిల్డింగ్ స్ట్రక్చర్ చాలా వరకు మారిపోవడమే కాకుండా, ప్రాజెక్టు ఖర్చు కూడా చాలా పెరిగింది. గుర్తించిన వ్యత్యాసాలను ఆర్‌అండ్‌బీ కూడా ఆమోదించింది
* ప్రాజెక్టు నిర్మాణంలో తాము గుర్తించిన వ్యత్యాసాలను ఆర్‌అండ్‌బీ శాఖ కూడా ఆమోదించించిందని కన్సెల్టెన్సీ సంస్థ లేఖలో స్పష్టం చేసింది. దీని ఫలితంగా నిర్మాణ పరిణామాలు, మార్పుల కారణంగా ధరల్లో గణనీయ పెరుగుదల సంభవించింది. ప్రాథమిక దశలోనే ఇటువంటి వ్యత్యాసాలు జరిగితే, తదుపరి దశల్లో ఇవి మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న టెండర్ విలువ కంటే దాదాపు రూ. 5000 కోట్ల వ్యయానికి దారితీస్తుందని, దీనివల్ల మొత్తం ప్రాజెక్ట్ వ్యయ నియంత్రణను దెబ్బతీస్తుందని కన్సల్టెన్సీ సంస్థ లేఖలో పేర్కొంది.
ఆదేశాల ప్రకారం డ్రాయింగ్‌లు
మా పరిశీలనలో వెల్లడైన అంశాలు, వృత్తిపరమైన సలహాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నప్పటికీ.. సూచించిన సవరణల ప్రకారం డ్రాయింగులను అందించాలని మమ్మల్ని ఆదేశించారు. అందుకు అనుగుణంగానే డ్రాయింగులను తయారుచేసి అందించాం. అయితే ఇటువంటి మార్పులపై తుది నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం అధికారులకే ఉంటుంది. అందుకే వారు ఆదేశించినట్లుగా సవరించిన డ్రాయింగులను తాము సిద్ధం చేసి సమర్పించినట్టు కన్సల్టెన్సీ సంస్థ తన లేఖలో వివరించింది.
ఆర్‌అండ్‌బీ ఇంజనీర్ల ఆదేశాల మేరకే తాము చాలాసార్లు డ్రాయింగులను సవరించి జారీ చేసినప్పటికీ.. సాంకేతిక, ఆర్థిక ప్రభావాలను, తమ వృత్తిపరమైన ఆందోళనలను రికార్డుల్లో నమోదు చేస్తూనే ఉన్నామని పేర్కొంది. అంతిమంగా తమకు వచ్చిన ఆదేశాలను పాటించడమే మా పాత్ర. ఈ అంశాలను బిల్డింగ్ కమిటీ గానీ, తమ సంస్థ గానీ అంగీకరించినట్టుగా భావించరాదని కన్సల్టెన్సీ సంస్థ వివరణ ఇచ్చింది.






