25 May, 2026 | 1:36 AM

కోతలు విధిస్తే కఠిన చర్యలు

25-05-2026 12:47 AM
  1. తాలు, తరుగు పేరుతో రైతుకు నష్ట పరిచే ఏ చర్యనూ ఉపేక్షించబోం
  2. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు చేర్చాలి
  3. ఈ సీజన్‌లో ఇప్పటికే 51 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం
  4. 8,749 కోట్లు రైతులకు చెల్లించాం: -మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, మే 24(విజయక్రాంతి): తడిసిన ధాన్యం పేరుతో ఒక్క రైతును కూడా నష్టపరిచే ప్రసక్తే లేదని, తాలు, తరుగు పేరుతో కోతలు విధిస్తే మిల్లర్లతో పాటు కొనుగోలు సిబ్బందిపై కూడా కఠి న చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేయని 8.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

అకాల వర్షాలు, గాలివానలు, వడగండ్ల వర్షాలు వస్తాయేమోనన్న భయంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించిన రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రైతు ల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అయోమయం, గందరగోళం సృష్టించవద్దని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై ఆదివారం హైదరాబాద్ ఎర్రమంజిల్ కాలనీలోని కేంద్ర పౌర సరఫరాల శాఖా కార్యాలయం నుండి మంత్రులు ,ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖాధికారులతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీం ద్ర పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ ప్రాంతాలనుండి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్షణకు మార్ తదితర మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లా డుతూ.. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు. ఈ సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి రూ.45 వేల కోట్ల చెల్లింపులు చేసిందన్నారు. భారతదేశంలోనే రికార్డు స్థాయిలో తెలంగాణలో 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించి బాయిల్ రైస్‌గా మారుస్తోందని చెప్పారు.

కొనుగోళ్ల ప్రక్రియలో ట్యాగింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తే రైతులకు త్వరితగతిన చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. అవసరమైతే ఆదివారం రోజున కూడా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి రూ. 8,749 కోట్ల చెల్లింపులు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21 కోట్ల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. గన్నీ బ్యాగుల కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేశారు.

ప్రతిపక్షాలు రాజకీయ రాద్ధాంతం సృష్టించి రైతాంగంలో గందరగోళం సృష్టించేందుకే ఇటువంటి ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే హమాలీలలో ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులేనని, స్థానికంగా ఎవరూ పెద్దగా ఈ పనుల్లో పనిచేయడం లేదని తెలిపారు. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పాల్గొనేందుకు వారు స్వగ్రామాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కొంత జాప్యం ఏర్పడిందన్నారు.

రబీ సీజన్‌లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్లు మంత్రి వెల్లడించారు. తాజా అంచనాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండగా, ఇప్పటికే 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ అత్యంత సునిశితమైనదని, ఎక్కడా రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో విజయవంతంగా నిర్వహిస్తున్న తీరును ఆయన అభినందించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్నే కొనుగోలు చేస్తోందని, మిగిలిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మద్దతు ధర ప్రకటించినప్పటికీ కేంద్రం పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆయన విమర్శించారు.