25 May, 2026 | 2:41 AM

సంస్థ సర్కారు.. ఉద్యోగులే ప్రైవేటు!

25-05-2026 01:40 AM

ఆర్టీసీ భవిష్యత్తును నిర్ణయించేది ఎలక్ట్రిక్ బస్సులే..

ఇప్పటికే ఆర్టీసీలో 500 ఈ త్వరలో మరో 2,000 సర్వీసులు రాక

  1. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో 2 వేల మందికిపైగా ప్రైవేటు ఉద్యోగులు 
  2. ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు శాశ్వత నియామకాలకు అడ్డుకట్ట పడే అవకాశం
  3. ఆందోళనలో కార్మిక వర్గాలు

హైదరాబాద్, మే 2౪ (విజయక్రాంతి): ఆర్టీసీ భవిష్యత్తును ఎలక్ట్రిక్ బస్సు(ఈవీ)లే నిర్ణయించనున్నాయా.. అంటే అవునే సమాధానం వస్తోంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను అందరూ ఆహ్వానించాల్సిందే. దీనికి సంస్థ ఉద్యోగులు మినహాయింపేమీ కాదు. అయితే పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సు లు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం.. సంస్థ ఉద్యోగులను వాటికి కనెక్ట్ చేయకుండా.. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ లేదా ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియమిస్తుండటం సంబంధి త వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

సంస్థ భవిష్యత్తుపైనే కాదు.. తమ భవిష్యత్‌పై కూడా ఈవీ బస్సులు ప్రభావం చూపనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆర్టీసీ సుమారు 500 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. సంస్థ లో ఒక కొత్త బస్సు చేరితే సుమారు ఐదుగురికి ఉపాధి లభిస్తుంది. కనీసం నలుగురి కైనా అదనంగా ఉపాధి కల్పించాలి. కానీ, ప్రస్తుతం ఆర్టీసీ ఆధ్వర్యంలో 500 వరకు ఈవీ బస్సులు నడుస్తున్నా ఒక్క శాశ్వత ఉద్యోగి పెరిగింది లేదు.

ఇందుకు ప్రధాన కారణం ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు, ఏజెన్సీల ద్వారా ఉద్యోగులను నియమిస్తుండ టం. సుమారు 2 వేల మందికిపైగా ప్రైవే టు ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులకు పోటీ గా పనిచేస్తున్నారన్నమాట. త్వరలో మరో 2,000 ఈవీ బస్సులను ప్రవేశపెట్టనున్న ట్టు ప్రభుత్వం ప్రకటించింది. అంటే మరో 8,000 మందికిపైగా ప్రైవేటు ఉద్యోగులు రానున్నారని ఆర్టీసీ కార్మిక సంఘాలు నెత్తినోరు కొట్టుకుంటున్నాయి. భవిష్యత్తులో ఆర్టీసీలో ఉద్యోగులు 40 వేల మంది ఉంటే.. అందులో 25 శాతానికిపైగా అంటే 10 వేల మందికిపైగా ప్రైవేటు ఉద్యోగులు ఉంటారన్నమాట.

కొత్త రిక్రూట్‌మెంటే లేదు..

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్టీసీలో మొత్తం  సుమారు 58 వేల మంది ఉద్యోగులు ఉండేవారు. ప్రతి ఏటా రిటైర్డ్ అవుతున్నవారు, అనారోగ్య కారణాలు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నవారు వేలలో ఉంటున్నారు. అయితే రిక్రూట్‌మెంట్ మాత్రం ఉండటం లేదు. బస్సుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయినా.. గడిచిన 12 ఏళ్లలో 18 వేల మందికి వరకు ఆర్టీసీలో ఉద్యోగుల సంఖ్య తగ్గింది. బస్సుల సంఖ్య పెరుగుతున్నా ఉద్యోగులా సంఖ్య ఏటేటా తగ్గుతూ వస్తోంది.

భవిష్యత్ తరాలకు నో ఎంట్రీ!

రిటైర్‌మెంట్‌తో పాటు వివిధ కారణాల వల్ల ఆర్టీసీని వీడుతున్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్యకు అనుగుణంగా రిక్రూట్‌మెంట్ జరగాలి. అదే సమయంలో పెరుగుతున్న బస్సులకు అనుగుణంగా.. ఒక్కో బస్సుకు 4 నుంచి ఐదుగురి చొప్పున ఉద్యోగుల సంఖ్య కూడా పెరగాలి. కానీ అందుకు విరు ద్ధంగా జరుగుతున్నట్లు ఆర్టీసీ సంఘాల నాయకులు చెబుతున్నారు. సంస్థలో ఇప్పుడున్న ఉద్యోగులు, కార్మికులను ఇతర ప్రాంతాల్లోని డిపోల్లో సర్దుబాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకపక్క ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సంఖ్య తగ్గిపోతూ ఉండగా.. భవిష్యత్తు తరాలను సంస్థలోకి రాకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అందులో భాగంగనే ప్రైవేట్ ఉద్యోగులను ప్రోత్సహిస్తోందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.

ప్రధాన కారణాలు..

ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలతో ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాలేనని కార్మిక సంఘాలు, విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈవీ బస్సులను తయారుచేసి, సరఫరా చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుని..  వాటిని అద్దెకు తీసుకుంటుంది. పైగా అద్దె బస్సులు కావడంతో.. వాటిపై రెగ్యులర్ ఉద్యోగులు పనిచేయలేరు. అప్పుడు ప్రైవేటు సంస్థలే ఉద్యోగులను (డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, సూపర్‌వైజర్లు, అధికారులు) కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతుల్లో నియమించుకుంటున్నాయి.  

త్వరలో 25 శాతానికి ప్రైవేట్ ఉద్యోగులు..

ప్రస్తుతం 500 వరకు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. వీటి నిర్వహణకు సదరు ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్‌వైజర్లు, మెకానిక్‌లు, అధికారులు సుమారు 2 వేల మంది వరకు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం సంస్థలో ఉన్న 40 వేల మంది కార్మికులు, ఉద్యోగుల సంఖ్యతో పోల్చుకుంటే.. ఈవీ బస్సుల నిర్వహణకు ప్రైవేటు కంపెనీలు నియమించుకున్న ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా కనపడవచ్చు.

కానీ మరో 2, 3 నెలల్లో 2 వేల వరకు  ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని ప్రభుత్వమే చెబుతోంది. అంటే ఆ బస్సుల నిర్వహణకూడా ప్రైవేటు సంస్థలే చూసుకుంటాయి. ఈ లెక్కన 8 వేల మంది ఉద్యోగులను ప్రైవేటు కార్పొరేట్ సంస్థల ద్వారా నియమిస్తారు.  అప్పుడు ఆర్టీసీలో కేవలం 40 వేల కంటే తక్కువ మందే ఉద్యోగులు ఉంటారు. 25 శాతానికిపైగా ప్రైవేటు ఉద్యోగుల సంఖ్య ఉంటుంది.

నాలుగైదు సంవత్సరాల్లో మరో 10వేల ఎలక్ట్రిక్ బస్సులు

పర్యావరణహిత చర్యల్లో భాగంగా నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు రానున్న నాలుగైదు సంవత్సరాల్లో మరో 10 వేల బస్సులు రోడ్లపైకి వచ్చే అవకాశం కనపడుతోంది. ఆ లెక్కన సుమారు 40 నుంచి 50 వేల మంది ఉద్యోగులు ప్రైవేటు సంస్థల పరిధిలో పని చేసే చాన్స్ ఉంది. సంస్థ తరఫున నూతన నియామకాలు ఉండనందున శాశ్వత ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతూనే ఉంటుంది. ఈ లెక్కన సంస్థ భవిష్యత్‌తో పాటు ఉద్యోగుల భవిష్యత్‌ను ఎలక్ట్రిక్ బస్సులు నిర్ణయిస్తాయని విశ్లేషకులు అంటున్నారు.