25 May, 2026 | 3:06 AM

చిలపల్లి వరుస చోరీల కేసులను ఛేదించిన మెదక్ పోలీసులు

25-05-2026 02:04 AM
  1. కోటి ముప్పు ఐదు లక్షల విలువైన బంగారం, వెండి వస్తువుల రికవరీ
  2. విశేషంగా కృషి చేసిన పోలీసు బృందాలకు రివార్డులు
  3. మెదక్ జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు

మెదక్, మే 24 (విజయక్రాంతి) : మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం చిలపల్లి గ్రామంలో వరుసగా జరిగిన చోరీల కేసులను మెదక్ జిల్లా పోలీసులు అత్యంత వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. దొంగిలించబడిన భారీ మొత్తంలో బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ రాత్రి గ్రామంలోని తాళం వేసిన ఐదు ఇండ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగులు తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. సుమారు 109 తులాల 9 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండున్నర కిలోల వెండి వస్తువులు, రూ.19 వేల నగదు అపహరించారు.

మరో ఇంట్లో మూడు తులాల బంగారం దొంగిలించారు. ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు, గూఢచారి సమాచారంతో నిందితులను గుర్తించి రామాయంపేట సమీపంలో చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 929.7 గ్రాముల బంగారం, 1.7 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు జాదవ్ జైరాం నాయక్ అలియాస్ జెమ్లా నాయ్ప ఇప్పటికే పలు జిల్లాల్లో అనేక చోరీ కేసులు ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఐదు కేసులతో పాటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో జరిగిన మరో 12 కేసులను కూడా నిందితుడు ఒప్పుకున్నాడు.

మొత్తం 17 కేసుల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు. నిందితులను వేగంగా పట్టుకున్నందుకు బాధితులు రాములు, మాణిక్ రెడ్డి జిల్లా ఎస్పీతో పాటు కేసు దర్యాప్తు చేసిన పోలీసు సిబ్బందిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సీఐలు రేణుక రెడ్డి, జార్జ్, సందీప్ రెడ్డి, ఎస్‌ఐలు శంకర్, ప్రవీణ్ రెడ్డి, పోచయ్య, సీసీఎస్ బృందం, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.