25 May, 2026 | 1:07 AM

అర్ధరాత్రి ‘కుళ్లిన’ దందా!

25-05-2026 12:00 AM
  1. గ్రామాలపై చికెన్ వ్యర్థాల ముప్పు!
  2. నగరాల నుంచి పల్లెలకు తరలుతున్న మాంసం వ్యర్థాలు
  3. చీకటి పడితే చాలు రోడ్ల పక్కనే అక్రమంగా పారబోత
  4. దుర్వాసనతో ఊపిరాడని పరిస్థితి.. అంటువ్యాధుల భయంలో గ్రామస్థులు
  5. పట్టించుకోని అధికారులు.. మొయినాబాద్ పరిసరాల్లో తీవ్ర ఆందోళన

మొయినాబాద్, మే 24 (విజయక్రాంతి): పల్లెటూరి స్వచ్ఛమైన గాలి ఇప్పుడు కలుషితమైపోతోంది. నగరాల్లోని చికెన్ సెంటర్ల నిర్వాహకులు, కొందరు స్వార్థపరులు చేసే పాడుపని వల్ల గ్రామాలు రోగాల బారిన పడే ప్రమాదం ఏర్పడింది. నగర ప్రాంతాల నుంచి చికెన్ వ్యర్థాలను రాత్రి వేళల్లో రహస్యంగా గ్రామాల వైపు తరలిస్తూ, రోడ్ల పక్కన అక్రమంగా పారబోస్తున్న ఘటనలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

చీకటి మాటున ‘వ్యర్థాల’ అక్రమ రవాణా..

ముఖ్యంగా రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య, రోడ్లపై ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఈ దందా సాగిస్తున్నారు. చిన్న చిన్న లోడింగ్ వాహనాలు, ఆటోల్లో నగరంలోని చికెన్ షాపుల నుంచి టన్నుల కొద్దీ వ్యర్థాలను తీసుకొచ్చి, మొయినాబాద్ శివార్లు, నిర్మానుష్యంగా ఉండే లింక్ రోడ్లు, పంట పొలాల పక్కన కుమ్మరించి గుట్టుచప్పుడు కాకుండా పరారవుతున్నారు. ‘ఉదయం వాకింగ్కు వెళ్దామంటే రోడ్లపై అడుగు పెట్టలేకపోతున్నాం. ఆ దుర్వాసన భరించలేక ఇళ్లల్లో తలుపులు వేసుకుని కూర్చోవాల్సి వస్తోంది‘ అని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ చికెన్ వ్యర్థాల వల్ల పరిసర ప్రాంతాల్లో భరించలేని దుర్వాసన వస్తోంది. రాబోయేది వర్షాకాలం కావడంతో ఈ మాంసం వ్యర్థాలు కుళ్లిపోయి ఈగలు, దోమలు విపరీతంగా పెరిగిపోయి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.మరోవైపు, ఈ వ్యర్థాల కోసం వీధి కుక్కలు, పందులు, కాకులు వందల సంఖ్యలో అక్కడ చేరుతున్నాయి. ఆ మాంసం ముక్కలను రోడ్ల మధ్యలోకి లాగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా, చికెన్ వ్యర్థాలను తిని పిచ్చిగా మారిన వీధి కుక్కలు.. ఆ దారిలో వెళ్లే ద్విచక్ర వాహనదారులపై, పిల్లలపై దాడులకు తెగబడుతుండటంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వర్షాలు పడితే మరింత ప్రమాదం..

కొద్ది రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుండటంతో గ్రామస్థుల్లో ఆందోళన రెట్టింపవుతోంది. వర్షం నీటిలో ఈ కుళ్ళిన వ్యర్థాలు కలిసి, సమీపంలోని చెరువులు, కుంటలు, భూగర్భ జలాల్లోకి చేరితే తాగునీరు పూర్తిగా కలుషితమైపోతుందని హెచ్చరిస్తున్నారు. ఇది పశువుల ఆరోగ్యానికి కూడా తీవ్ర నష్టం చేకూరుస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ అక్రమ తంతుపై గ్రామస్థులు స్థానిక పంచాయతీ, మున్సిపల్ మరియు పోలీసు అధికారులను ఆశ్రయిస్తున్నారు.

రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని, అనుమానాస్పదంగా తిరిగే లోడింగ్ వాహనాలను తనిఖీ చేయాలని కోరుతున్నారు. వ్యర్థాలు ఎక్కువగా పారబోసే ప్రాంతాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి వ్యర్థాలను ఇష్టానుసారంగా పారబోసే వాహనాలను సీజ్ చేసి, సదరు చికెన్ షాపుల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గ్రామ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన ఈ ‘చికెన్ వ్యర్థాల’ అక్రమ పారబోతకు శాశ్వత చెక్ పెట్టాలని పల్లె జనం కోరుతున్నారు.