25 May, 2026 | 3:08 AM

వరి ధాన్యం తరలించడానికి లారీల కొరత లేకుండా చూడాలి

25-05-2026 02:04 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, మే 24 (విజయక్రాంతి): వరి ధాన్యం తరలించడానికి లారీల కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తో కలిసి పెద్దగూడెంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. కొనుగోలు రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్ ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది, ఇంకా ఎంత ధాన్యం మిగిలి ఉంది అనే వివరాలను పరిశీలించారు.

ఇంకా 11 వేల బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉందని కొనుగోలు కేంద్రం ఇంచార్జి బదులిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ వర్షం కారణంగా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  వరి ధాన్యం తరలించడానికి లారీల కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని యుద్ద ప్రాతిపదికన కొనుగోలు చేసి వేగంగా కేటాయించిన మిల్లు లేదా గోడౌన్ కు తరలించాలని సూచించారు.

ఆకస్మిక వర్షాలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. తడిసిన ధాన్యం విషయంలో నిబంధనల ప్రకారం రైతులకు నష్టం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అకాల వర్షాల వల్ల రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుందని, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. పౌరసరఫరాల అధికారులు, రెవెన్యూ అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.