25 May, 2026 | 1:35 AM

గులాబీ హవా!

25-05-2026 12:58 AM
  1. రాష్ట్రంలో తిరిగి పుంజుకుంటున్న బీఆర్‌ఎస్
  2. కాంగ్రెస్ పాలనపై అన్నివర్గాల్లో తీవ్ర అసంతృప్తి కారు వైపు రాజకీయ సమీకరణాల స్పీడు 
  3. సమర్థవంతమైన ప్రతిపక్షంగా పార్టీ కేసీఆర్ వైపే రైతాంగం మొగ్గు 
  4. 2023 ఎన్నికల్లో 2 శాతం ఓట్లే తేడా, పదిలంగానే ఓటు బ్యాంకు కీలకంగా కేసీఆర్ చరిష్మా, కేటీఆర్, హరీశ్‌రావు యాక్షన్ ప్లాన్ 
  5. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

హైదరాబాద్, మే24(విజయక్రాంతి): 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2 శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయిన బీఆర్‌ఎస్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ బలంగా పుంజుకుంటోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తు న్నాయి. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై పెరుగుతున్న అసంతృప్తి, అమలుకాని హామీలతో నిరాశలో ఉన్న రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత, గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న సమస్యలన్నీ కలిసి అధికార పార్టీపై వ్యతిరేకతను పెంచుతున్నాయి.

మరోవైపు రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్ష న్లు, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ వంటి బీఆర్‌ఎస్ అమలు చేసిన పథకాలతో ప్రజలు ప్రస్తుత పాలనను పోల్చుకుంటున్నారని క్షేత్రస్థాయిలో చర్చ జరుగు తుంది. ఇదే సమయంలో ప్రజాసమస్యలపై దూకుడుగా స్పందిస్తూ, బాధితులకు అండగా నిలుస్తూ, సమర్థవంత మైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న బీఆర్‌ఎస్ మళ్లీ ప్రజల్లో బలపడుతోంది. దీనికి తోడు తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది.

అయితే కాంగ్రెస్‌కు, బీఆర్‌ఎస్‌కు మధ్య కేవలం 2 శాతం ఓట్ల తేడా నే ఉండటంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏమాత్రం పుంజుకుని కాంగ్రెస్ ఓట్లను చీలిస్తే అది గులాబీ పార్టీకి రాజకీయంగా కలిసొచ్చి.. రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్‌ఎస్ ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా తమ బలమైన ఓటు బ్యాంకు పదిలమేనని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌కు 39.40 శాతం ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 37.35 శాతం ఓట్లు రావడం గులాబీ పార్టీ ప్రభావం పూర్తిగా తగ్గలేదని స్పష్టం చేస్తున్నాయి. దీంతో గ్రామీణ తెలంగాణలో రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, సాగునీటి ప్రాజెక్టులు వంటి పథకాల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. మరోవైపు రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై పెరుగుతున్న అసంతృప్తి, అమలుకాని హామీలు, రైతు సమస్యలు, నిరుద్యోగ యువతలో నిరాశ, కేసీఆర్‌పై ఇంకా కొనసాగుతున్న విశ్వాసం వచ్చే అసెంబ్లీ ఎన్నికలో మరోసారి గులాబీ జెండా ఎగురుతుందని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

అన్ని వర్గాల్లో అసంతృప్తే..

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు రాష్ట్ర ప్రజల్లో భారీ అంచనాలు పెంచాయి. కానీ అందులో చాలా వరకు అమలు కాకపోవడంతో రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. ఎన్నికల సమయంలో భారీ అంచనాలు పెంచిన హామీలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం, రైతు రుణమాఫీపై కొనసాగుతున్న అనిశ్చితి, మహిళా పథకాల అమలులో జాప్యం, నిరుద్యోగ యువతకు ఆశించిన స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ప్రజల్లో ప్రభుత్వంపై నిరాశ పెంచుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సమస్యలు, కొనుగోలు కేంద్రాల అవ్యవస్థ, పెరిగిన సాగు ఖర్చులు రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

పట్టణ ప్రాంతాల్లో జీవన వ్యయం, ట్రాఫిక్, ఉపాధి సమస్యలు, ధరల పెరుగుదల మధ్యతరగతి వర్గాల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. దీంతో ప్రస్తుతం తెలంగాణలో అనేక వర్గాల ప్రజలు ప్రస్తుత కాంగ్రెస్ పాలనను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో పోల్చుకుంటున్నారు. మరోవైపు భారీ సాగునీటి ప్రాజెక్టులు, హైదరాబాద్ అభివృద్ధి, గ్రామీణ మౌలిక వసతుల అంశాలను కూడా బీఆర్‌ఎస్ ఇప్పుడు రాజకీయంగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈ పోలికలు ప్రజల్లో పెరుగుతున్న కొద్దీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి మరింత పెరిగి, రాజకీయంగా గులాబీ పార్టీకి అనుకూల పరిస్థితులుగా మారుతున్నాయి. 

కాంగ్రెస్‌కు సవాల్‌గా రైతుల సమస్యలు

తెలంగాణలోని రైతులకు రైతు భరోసా, రైతుబీమా, సన్న వడ్లకు బోనస్ వంటి అనేక హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా పెండింగ్, సరైన సమయానికి రాకపోవడం, బోనస్ చెల్లించడంలో జాప్యం వంటివి రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురుచేస్తున్నాయి. ముఖ్యంగా యూరియా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యాప్ విధానంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీనికితోడు పండించిన పంటను సరైన సమయంలో కొనుగోలు చేయకపోవడంతో అనేక మంది రైతులు ధాన్యం కుప్పలపైనే కన్నుమూయడం వంటి హృదయ విదారక ఘటనలతో రైతుల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.

పెరుగుతున్న సాగు ఖర్చులు, గిట్టుబాటు ధరలు, కొనుగోలు కేంద్రాల అవ్యవస్థ, 24 గంటల విద్యుత్ సరఫరాపై ఫిర్యాదులు, సాగునీటి సమస్యల కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు రుణమాఫీ అమలుపై కొనసాగుతున్న అసంతృప్తి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతికూలంగా మారుతోందనే అంచనాలు ఉన్నాయి. తెలంగాణలో రైతు ఓటు ఎప్పుడూ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే కీలక అంశం. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మారుతున్న ఈ పరిణామాలు.. బీఆర్‌ఎస్‌కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసిరానున్నాయి.

సమర్థవంతమైన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్

అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా బీఆర్‌ఎస్ తెలంగాణ రాజకీయాల్లో సమర్థవంతమైన ప్రతిపక్షంగా తన పాత్రను బలంగా పోషిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతు సమస్యలు, నిరుద్యోగం, మహిళా హామీలు, విద్యుత్ ఇబ్బందులు, కొనుగోలు కేంద్రాల అవ్యవస్థల వంటి ప్రతి ప్రజాసమస్యపై వెంటనే స్పందిస్తూ ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి తీసుకొస్తోంది. ముఖ్యంగా బాధిత కుటుంబాలకు అండగా నిలవడం, రైతు ఆత్మహత్యలు లేదా ప్రమాదాలు జరిగిన వెంటనే పరామర్శించడం, ప్రజాసమస్యలపై రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టడం ద్వారా బీఆర్‌ఎస్ మళ్లీ ప్రజల్లో క్రియాశీలకంగా ఉంది.

అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడం నుంచి సోషల్ మీడియాలో దూకుడుగా ప్రచారం చేయడం వరకు అన్ని వేదికలపై బీఆర్‌ఎస్ దూకుడు పెంచిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రజల మధ్యలోనే ఉన్న ప్రతిపక్షం అనే ఇమేజ్‌ను బలపరచడంలో బీఆర్‌ఎస్ సక్సెస్ అవుతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో అది రాజకీయంగా బీఆర్‌ఎస్‌కు కలిసివస్తుందని చెప్తున్నారు. 

కేసీఆర్ చరిస్మా.. కేటీఆర్, హరీశ్‌రావు యాక్షన్ ప్లాన్

తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ చరిస్మా ఇంకా బలంగానే ఉందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో స్పష్టంగా వినిపిస్తోంది. 2023 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా కేసీఆర్‌పై గ్రామీణ తెలంగాణలో ఉన్న వ్యక్తిగత ప్రభావం పూర్తిగా తగ్గలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఆయనకు ఉన్న గుర్తింపు, రాష్ట్ర ఆవిర్భావంతో ముడిపడిన భావోద్వేగం, రైతు బంధు, మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులతో ఏర్పడిన రాజకీయ ఇమేజ్ ఇప్పటికీ బీఆర్‌ఎస్‌కు ప్రధాన బలమే.

మరోవైపు కాంగ్రెస్ పాలనపై పెరుగుతున్న అసంతృప్తి కూడా కేసీఆర్ నాయకత్వాన్ని మళ్లీ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ దూకుడుగా స్పందించడం, కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవుతుండడం పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. దీనికితోడు బీఆర్‌ఎస్ వర్కంగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు క్రియాశీలక రాజకీయాలు పార్టీకి బలంగా నిలుస్తున్నాయి. నిరంతరం ప్రజా సమస్యలపై స్పందించడం, సోషల్ మీడియాలో దూకుడుగా వ్యవహరించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ద్వారా పార్టీ ప్రజల మనస్సుల్లోకి వెళ్తుంది. ముఖ్యంగా యువత, ఐటీ వర్గాలు, పట్టణ ఓటర్లలో కేటీఆర్‌కు, గ్రామీణ ఓటర్లు, రైతుల్లో హరీశ్‌రావుకు ప్రత్యేక గుర్తింపు ఉండటం బీఆర్‌ఎస్‌కు కలిసి వస్తోంది.

మరోవైపు ప్రజల్లోకి వెళ్లి బాధితులను పరామర్శించడం, పార్టీ శ్రేణులతో నిరంతరం అందుబాటులో ఉండటం, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ద్వారా ప్రజలకు మరింత చేరువవతున్నారు. కేసీఆర్ అనుభవానికి తోడు కేటీఆర్, హరీశ్‌రావు దూకుడుతో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మరింత బలమైన రాజకీయ శక్తి అవతరిస్తుందని ధీమా వ్యక్తమవుతున్నది. 

త్రిముఖ పోరు.. బీఆర్‌ఎస్‌కే ప్లస్

అయితే రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెరగడం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు రాజకీయంగా లాభం కలిగించే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో బీజేపీ కీలకంగా వ్యవహరిస్తే త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య కేవలం 2 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు సాధించడంలో బీజేపీ వ్యూహ రచన చేసినా బీఆర్‌ఎస్‌కు ఉన్న ఓటు బ్యాంకు పదిలంగా ఉండటం బీఆర్‌ఎస్‌కు ఎంతో కలిసి వచ్చే అంశంగా మారుతుంది. ఈ క్రమంలో స్వల్ప ఓట్ల మార్పే ఎన్నికల ఫలితాలను పూర్తిగా మార్చగలదనే చర్చ ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరిం చుకుంది.

ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాలు, హిందుత్వ ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ ప్రభావం, గ్రామీణ తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభావం చూపుతాయి. అలాంటి పరిస్థితుల్లో త్రిముఖ పోటీ ఎక్కువైన నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ తన సంప్రదాయ ఓటు బ్యాంక్ ఆధారంగా స్వల్ప మెజారిటీలతో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ వ్యతిరేక ఓటు పూర్తిగా బీజేపీ వైపు వెళ్లకపోవడం, అదే సమయంలో బీజేపీ కాంగ్రెస్ ఓట్లలో చీలిక తీసుకురావడం వంటి అంశాలు వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీకి రాజకీయంగా అనుకూల సమీకరణాలు ఏర్పడే అవకాశాలపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. 

హైదరాబాద్ అభివృద్ధి అజెండా

బీఆర్‌ఎస్ హైదరాబాద్ అభివృద్ధిని మళ్లీ ఎన్నికల ప్రధాన అజెండాగా మార్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ పెట్టుబడులు, భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు, మెట్రో, రియల్ ఎస్టేట్ వృద్ధి, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు కలిసి హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడంలో బీఆర్‌ఎస్ పాలన కీలక పాత్ర పోషించిందనే ప్రచారాన్ని గులాబీ పార్టీ మళ్లీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఐటీ, కార్పొరేట్, మధ్యతరగతి, అర్బన్ ఓటర్లలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇప్పటికీ బీఆర్‌ఎస్‌కు సానుకూలంగా ఉంది.

మరోవైపు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ట్రాఫిక్ సమస్యలు, మౌలిక వసతుల పనుల్లో మందగమనం, పెట్టుబడులపై అనిశ్చితి వంటి అంశాలను బీఆర్‌ఎస్ రాజకీయంగా ఎత్తిచూపుతోంది. కేటీఆర్ కూడా ఎల్లప్పుడూ హైదరాబాద్ అభివృద్ధి, ఐటీ రంగం, పెట్టుబడుల అంశాలపై స్పందిస్తూ అర్బన్ ఓటర్లను ఆకర్షించే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చింది బీఆర్‌ఎస్ పాలనే అనే అంశాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రధాన ఆయుధంగా మార్చు కోనుంది. ప్రస్తుత అనేక రాజకీయ పరిణామాలు వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మళ్లీ పట్టం కడుతాయని పార్టీ నేతలతోపాటు ప్రజల్లోనూ ధీమా వ్యక్తమవుతోంది.