రూ.1.65 కోట్ల బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే పాయం భూమిపూజ
మిట్టగూడెం, సండ్రలబోడులో హ్యాండ్ బోర్ల ప్రారంభం
అశ్వాపురం, జూన్ 24 (విజయక్రాంతి): అశ్వాపురం మండలంలో అభివృద్ధి పనులకు వేగం పెంచుతూ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండలంలోని బట్టీలగుంపురాంనగర్ గ్రామాల మధ్య రూ.1.65 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, నాణ్యమైన రహదారుల నిర్మాణంతో గ్రామాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు.
ఈ రహదారి నిర్మాణంతో బట్టీలగుంపు, రాంనగర్ గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరమవడంతో పాటు విద్యార్థులు, రైతులు, ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. అనంతరం మిట్టగూడెం గ్రామంలోని పాయం మంగ య్య గుంపులో స్థానిక ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన హ్యాండ్ బోర్ను ప్రారంభించారు. అలాగే సండ్రలబోడు గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన మరో హ్యాండ్ బోర్ను కూడా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్బాబు, తుక్కాని మధుసూదన్రెడ్డి, బూరెడ్డి వెంకటరెడ్డి, సర్పంచులు కలివేటి సరిత, జిమ్మా ఝాన్సీ, ఏనిక ఉషారాణి, కోర్సా కృష్ణ, మచ్చా నరసింహారావు, కుంజా జాను, సబ్కా పిచ్చయ్య, తెల్లం నాగమణి, ఉపసర్పంచులు హర్షా నాయక్, శీలం సంజీవ్రెడ్డి, ఇర్ఫా లక్ష్మణ్, కోండ్రు విజయకుమారి, మాజీ సర్పంచులు బట్ట సత్యనారాయణ, సోడే వెంకటేశ్వర్లు, జిన్నేక నాగయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






