4 August, 2026 | 3:37 AM

నిర్లక్ష్య అధికారులపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆగ్రహం

04-08-2026 12:00 AM

సమాధానాలు చెప్పలేని అధికారులకు మెమోలు, నోటీసుల జారీకి ఆదేశం

శ్రీరంగాపురం, ఆగస్టు 3: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించిన ఆయన, సరైన సమాచారం ఇవ్వలేకపోయిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సమావేశంలో విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోయిన మండల విద్యాధికారి హనుమంతుకు మెమో జారీ చేయాలని, విద్యుత్ శాఖ లైన్మన్కు నోటీసు ఇవ్వాలని సూచించారు. అలాగే సమావేశానికి గైర్హాజరైన నీటిపారుదల శాఖ అధికారులకు కూడా వెంటనే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం, సమావేశాలకు గైర్హాజరు, ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించిన ఎమ్మెల్యే, పనితీరు మెరుగుపరచుకోని అధికారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.