మంథనిలో మంత్రి శ్రీధర్‌బాబు
శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం
మంథని, జూలై 29 (విజయక్రాంతి): గురు పౌర్ణమిని పురస్కరించుకుని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంథని పట్టణంలోని రావిచెరుకట్ట వీధిలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని బుధవారం దర్శించుకున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని శాఖాంబరి దేవిగా విశేషంగా అలంకరించారు. మంత్రి శ్రీధర్ బాబుకు అర్చకులు మారుపాక ప్రశాంత్ శర్మ ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వేదమంత్రాలతో మంత్రికి ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఎంతటి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మంథని నియోజకవర్గంలో జరిగే ఆధ్యాత్మిక, దైవ కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్‌బాబు క్రమం తప్పకుండా పాల్గొనడం పట్ల స్థానిక భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దివంగత శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వేసిన బాటలోనే ఆయన తనయులు మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు (శ్రీధర్ బాబు సోదరుడు)లు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రాంతీయ ఆలయాల పునరుద్ధరణకు, అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని స్థానికులు కొనియాడారు.






