15 July, 2026 | 12:20 AM

వైద్య సేవల్లో లోపాలు లేకుండా చూడాలి

15-07-2026 12:19 AM

బస్తీ దవాఖాన సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్

జూబ్లీహిల్స్, జూలై 14 (విజయక్రాంతి): బోరబండ డివిజన్ పరిధిలోని బస్తీ బస్తీ దవాఖానను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. డివిజనులో మంగళవారం పర్యటించిన ఆయన వెంట జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ వున్నారు. దవాఖానకు ప్రతిరోజూ ఎందరు రోగులు వస్తున్నారు, వారికి అందుతున్న సేవలు, సిబ్బందికి సంబంధించి వివిధ అంశాలపై వాకాబు చేశారు. రోగులకు నాణ్యమైన మందులు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం ఎమ్మెల్యేతో కలిసి మాట్లాడుతూ కలెక్టర్ తో సహా జిహెచ్‌ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు బస్తీ దవాఖానలను తనిఖీ చేయాలన్నారు. ప్రజల కు వైద్య సేవల్లో ఎటువంటి లోపాలు ఉండకుండా చూడాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ క్యాంటీన్ల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజారోగ్యానికి బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆల, జిహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, ఖైరతాబాద్ ఎంఆర్‌ఓ ప్రేమ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక, బోరబండ డీసీ ఉమ, ఈఆర్‌ఓ సురేశ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.