15 July, 2026 | 12:19 AM

డీఏలను, పీఆర్సీని వెంటనే ప్రకటించాలి

15-07-2026 12:19 AM
  1. తపస్ రాష్ట్ర సేవా వింగ్ కో కన్వీనర్ శ్రీనివాసరావు
  2. సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ముందు ధర్నా

మంచిర్యాల టౌన్, జూలై 14 : మూడేండ్లుగా అమలుకు నోచుకోని పిఆర్సిని, పెండింగ్ లో ఉన్న ఆరు డీఏలను వెంటనే ప్రకటించాలని తపస్ రాష్ట్ర సేవా వింగ్ కో కన్వీనర్ ఎస్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. తపస్ రాష్ట్ర శాఖ ఇచ్చిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళ వారం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రభుత్వం 100 రోజుల్లో పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామన్న హామీ ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు.

గత ప్రభుత్వ హయాం నుంచి ఉద్యోగులు ఆర్థికంగా చితికిపోయారని, ఈ ప్రభుత్వంపై విశ్వాసంతో ఓట్లేసి గెలిపించారని, మూడేండ్లుగా ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న అలసత్వాన్ని భరించలేకే తమ నిరసనను ధర్నా ద్వారా వ్యక్తం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళా వింగ్ కో కన్వీనర్ రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దు చేయాలని, సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన ఎస్‌ఎల్పిని రద్దు చేసుకొని, డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపచేయాలని, జీవో 190 ను విద్యాశాఖలో వెంటనే అమలు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు సమ్మె కాలపు జీతాన్ని విడుదల చేయాలని,

రిటైర్మెంట్ ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 ద్వారా వేతనాలు ఇవ్వాలని, నష్టపోయిన డీఎస్సీ 2008 ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బగ్గని రవికుమార్, ప్రధాన కార్యదర్శి భారతి అశోక్, జిల్లా నాయకులు నీలేశ్ కుమార్, కొట్టె నాగరాజు, సింగి రెడ్డి సాంబయ్య, తోడె తిరుపతిరెడ్డి, రమణయ్య, మోకెనపల్లి శ్రీనివాస్, అయిందాల నాగేందర్, చెట్ల శ్రీకాంత్, మందడి సత్తిరెడ్డి, రాజ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, అనురాధ, తిరుమల, గీతాబాయి, పొద్దుటూరు శ్రీనివాస్, మండల నాయకులు మేకం రమేష్, కృష్ణమూర్తి, నూకల సురేష్, రాజేశ్వర్, సంతోష్, శ్రీనివాసరెడ్డి, పీవీకే ప్రసాద్, దిలీప్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.