నిబంధనలు ‘నల్లమట్టి’ పాలు.!
- మోర్రం కొరకు అనుమతులు నల్లమట్టి తరలింపు
- వేబిల్లులు లేకుండానే 20 టిప్పర్లతో రవాణా
- అధిక లోడుతో రోడ్లు ధ్వంసం.. ఒక్కో టిప్పర్ మట్టి రూ. 20 వేలకు విక్రయం
- శిరుసనగండ్ల చింతలకుంటలో మైనింగ్ మాఫియా బరితెగింపు
- ‘కాసుల మత్తు’లో పట్టించుకోని అధికారులు
చారకొండ, జూన్ 2: ప్రభుత్వ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తి ముందు నిబంధనలన్నీ బేఖాతరు అవుతున్నాయి. చారకొండ మండలం శిరుసనగండ్ల గ్రామ పరిధిలోని ’చింతల కుంటలో సాగుతున్న మట్టి తవ్వకాలు ఇప్పుడు పర్యావరణానికి, పరిసర రైతుల పొలాలకు, స్థానిక రోడ్లకు ముప్పుగా పరిణమించాయి.
మైనింగ్ శాఖ జారీ చేసిన అధికారిక అనుమతి పత్రాలలోని ఏ ఒక్క నిబంధనను కూడా క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్ అమలు చేయడం లేదు. కొందరు నాయకులను, అధికారులను కాంట్రాక్టర్ మచ్చిక చేసుకోవడంతో, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతూ విచ్చలవిడిగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు.
అనుమతులమో మొరంకు.. తరలిస్తోంది ‘నల్లమట్టి’
మైనింగ్ శాఖ జారీ చేసిన ఉత్తర్వులకు, అక్కడ జరుగుతున్న దోపిడీకి అస్సలు పొంతన లేదు. అధికారికంగా కాంట్రాక్టర్ పొందింది కేవలం ’గ్రావెల్’ (మొరం) తవ్వుకోవడానికి మాత్రమే. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇటుకల తయారీకి అత్యంత డిమాండ్ ఉన్న, కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ నల్లమట్టిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు.
పత్రాల్లో ఒక ఖనిజానికి అనుమతి తీసుకుని, క్షేత్రస్థాయిలో మరో ఖనిజాన్ని కొల్లగొడుతుండటం ఇక్కడి మైనింగ్ మాఫియా బరితెగింపునకు అద్దం పడుతోంది. చెరువు గర్భం దెబ్బతినకుండా కేవలం 0.50 మీటర్ల (అడుగున్నర) లోతు వరకు మాత్రమే తవ్వకం జరపాలని నీటిపారుదల శాఖ స్పష్టమైన నివేదిక ఇచ్చింది. కానీ, అక్కడ మాత్రం ఏకంగా 10 అడుగుల మేర లోతుగా తవ్వేస్తూ చెరువును గుల్ల చేస్తున్నారు. రెండు భారీ హిటాచీ యంత్రాలు, 20 కి పైగా టిప్పర్లతో యుద్ధ ప్రాతిపదికన ఈ దందా సాగుతోంది.
వే బిల్లుల్లేవు.. అధిక లోడుతో రోడ్లు ధ్వంసం
నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మైనింగ్ పనులు జరగాలి. కానీ ఇక్కడ సాయంత్రం ఆరు గంటలు దాటినా, అర్ధరాత్రి వరకు టిప్పర్లు యథేచ్ఛగా తిరుగుతూ హల్చల్ చేస్తున్నాయి. మరింత ఘోరమైన విషయమేమిటంటే, మైనింగ్ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి టిప్పర్కు ఆన్లైన్ ట్రాన్సిట్ ఫారాలు/వే-బిల్స్ ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇక్కడ ఒక్క టిప్పర్ కు కూడా వే-బిల్లు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారు.
పైగా, నిర్దేశిత పరిమాణం కంటే భారీగా అధిక లోడుతో ఈ టిప్పర్లను నడుపుతున్నారు. ఫలితంగా శిరుసనగండ్ల పరిసర ప్రాంతాల్లోని అంతర్గత రహదారులు పూర్తిగా ధ్వంసమై గుంతలమయంగా మారుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. వే-బిల్లులు లేకపోవడంతో, ఈ నల్లమట్టిని ఇష్టం వచ్చిన ప్రాంతాలకు తరలించి బయటి మార్కెట్లో ఒక్కో టిప్పర్ను రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు అమ్ముకుంటూ రోజుకు లక్షలాది రూపాయలు అక్రమంగా గడిస్తున్నారు.
‘గ్రామాభివృద్ధి సాకు.. రూ. కోట్లల్లో దోపిడీ!
శిరుసనగండ్ల గ్రామ అభివృద్ధి కోసం రూ. 20 లక్షలు ఇస్తానని కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకున్నాడనే ఒకే ఒక్క సాకును అడ్డం పెట్టుకుని ఈ అక్రమ దందాను నడిపిస్తున్నట్లు స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ కమిటీలను, స్థానిక నాయకులను రూ. 20 లక్షల ఎరతో నోళ్లు నొక్కేసిన కాంట్రాక్టర్, ఇక్కడ ఏకంగా కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ ఖనిజాన్ని కొల్లగొడుతుంటే అడిగే నాథుడే కరువయ్యాడు.
కన్నెత్తి చూడని రెవెన్యూ, మైనింగ్ అధికారులు
ఇంత పెద్ద ఎత్తున, వందలాది ట్రిప్పుల మట్టి పగలు, రాత్రి, సెలవు రోజు అనే తేడా లేకుండా నల్లమట్టి తరలిపోతున్నా మైనింగ్ అధికారులు కానీ, అటు రెవెన్యూ యంత్రాంగం కానీ అటువైపు కన్నెత్తు చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ’ఏ ఒక్క నిబంధన ఉల్లంఘించినా అనుమతులు రద్దు చేస్తాం అని పత్రాల్లో రాసిన అధికారులు, కళ్ల ముందే ఇంత దారుణం జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.
కాంట్రాక్టర్ ఇచ్చే మామూళ్లతో అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ స్పందించి శిరుసనగండ్ల చింతలకుంటలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై తక్షణమే విచారణ జరిపించాలని, పర్మిట్ను రద్దు చేసి కాంట్రాక్ట్ప కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






