27 July, 2026 | 9:43 AM

రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం

27-07-2026 09:08 AM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేసి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే పార్టీ లక్ష్యమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న అన్నారు. ఆదివారం ఇల్లందులోని అయిత కాంప్లెక్స్‌లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బొళ్ల సూర్యం అధ్యక్షతన నిర్వహించిన బీఎల్ఏల సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో ఆదివాసీ, లంబాడ, మైనార్టీ వర్గాల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.

ప్రతి బీఎల్ఏ తమ పరిధిలోని ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇల్లందు నియోజకవర్గంలో ఇంకా 20,332 ఎస్‌ఐఆర్ ఫారాలు సమర్పించాల్సి ఉందని, ఇంటింటికీ వెళ్లి వాటిని సేకరించడంతో పాటు 18 ఏళ్లు నిండిన యువత పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కిరణ్ మిత్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి కార్తీక్, జిల్లా నాయకులు జీవీ భద్రం, ఎట్టి హరికృష్ణ, నయం, పుచ్చకాయల వీరభద్రం, పతే అహ్మద్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.