3 June, 2026 | 2:06 AM

అకాడమిక్, పరిపాలనా రంగాల్లో ‘కాకతీయ’ పురోగతి

03-06-2026 12:04 AM

కేయూ వీసీ ప్రతాప్ రెడ్డి

కాకతీయ యూనివర్సిటీ, జూన్ 2(విజయక్రాంతి): విశ్వవిద్యాలయం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోంది  వైస్ ఛాన్సలర్ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి - కాకతీయ విశ్వవిద్యాలయం అకాడమిక్, పరిపాలనా రంగాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తూ ముందుకు సాగుతోందని వైస్ ఛాన్సలర్ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వవిద్యాలయ పరిపాలన భవన ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం అధ్యక్షత వహించారు.  ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించిన వైస్ ఛాన్సలర్, విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాల నేపథ్యంలో విస్తృత స్థాయిలో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. 

పరిపాలనలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా ఉద్యోగులకు ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేసినట్లు తెలిపారు.బోధనేతర సిబ్బందికి పదోన్నతులు కల్పించినట్లు చెప్పారు. విశ్వవిద్యాలయ విభాగాల నుంచి వైస్ ఛాన్సలర్ కార్యాలయం వరకు అన్ని ఫైళ్ల నిర్వహణను ఈ-ఆఫీస్ ద్వారా ఆన్లైన్లో అమలు చేస్తున్నామని, ఆగస్టు నాటికి విశ్వవిద్యాలయం మొత్తం ఈ-ఆఫీస్ విధానంలోకి వస్తుందని తెలిపారు. 

పరీక్షల విభాగాన్ని పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేసినట్లు పేర్కొంటూ, విద్యార్థి కేంద్రిత పరిపాలనకు ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక అమలులో విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు.  అనంతరం విద్యా వారోత్సవాల సందర్భంగా జాతీయ స్థాయి అర్హత పరీక్షల్లో విజయాలు సాధించిన చివరి సంవత్సరం, చివరి సెమిస్టర్ విద్యార్థులకు ఆయన ప్రశంసాపత్రాలు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ఆచార్య బి. సురేష్ లాల్, డాక్టర్ బి. రమ, డాక్టర్ ఎన్. సుదర్శన్, ఎం. బాలు చౌహాన్, కె. అనిత రెడ్డి, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఆచార్య బి. వెంకట్రామరెడ్డి, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ పృథ్వీరాజు వల్లాల సమన్వయకర్తగా వ్యవహరించారు.