27 July, 2026 | 9:42 AM

కుషాయిగూడలో పశువుల అక్రమ రవాణా కలకలం

27-07-2026 09:10 AM

35 పశువుల స్వాధీనం – వివరాల వెల్లడిలో పోలీసుల మౌనం

ఉప్పల్ జూలై 26 విజయక్రాంతి: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పశువుల అక్రమ రవాణా ఘటన వెలుగులోకి రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు కుషాయిగూడ మార్కెట్ వద్ద తనిఖీలు నిర్వహించి, అక్రమంగా తరలిస్తున్న పశువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో జగదేపూర్ మార్కెట్ నుంచి జియాగూడకు పశువులను తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో 27 ఎద్దులు, 8 గేదెలు కలిపి మొత్తం 35 పశువులను స్వాధీనం చేసుకుని గోశాలలకు తరలించారు. అలాగే రవాణాకు వినియోగించిన రెండు బొలెరో వాహనాలను సీజ్ చేశారు.

అయితే, ఇంత పెద్ద మొత్తంలో పశువులు అక్రమంగా తరలింపునకు గురవుతున్నప్పటికీ ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులు ఎవరు, పశువులను ఎక్కడికి, ఏ ఉద్దేశంతో తరలిస్తున్నారనే అంశాలపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితుల పేర్లు, వారి నేపథ్యం, పశువుల యాజమాన్యానికి సంబంధించిన వివరాలు కూడా బయటకు రాలేదు. స్థానికుల సమాచారం లేకపోతే ఈ అక్రమ రవాణా బయటపడేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నగర శివార్లలో పశువుల అక్రమ రవాణా ముఠాలు యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.