పెద్దపల్లిలో మే 6న మెగా జాబ్ డ్రైవ్ నిర్వహణ
57 సంస్థలతో 1799 ఉద్యోగ అవకాశాలు లభ్యం
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా యువతకు ఉపాధి అవకాశాలను మరింత విస్తరించేందుకు జిల్లా పరిపాలన యంత్రాంగం, TASK మరియు DEET సంయుక్తంగా మే 6న మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ డ్రైవ్‌లో మొత్తం 57 సంస్థలు పాల్గొంటుండగా, సుమారు 1799 ఉద్యోగ అవకాశాలు లభ్యమవుతున్నాయని తెలిపారు. టెలికాం & కమ్యూనికేషన్, కస్టమర్ సపోర్ట్ & BPO, సేల్స్ & మార్కెటింగ్, డిజిటల్ సర్వీసెస్, ఫీల్డ్ ఆపరేషన్స్ వంటి విభిన్న రంగాల్లో ఈ అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు.
జిల్లాలోని యువతను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేయడం, వారికి నేరుగా ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. TASK మరియు DEET ద్వారా ఇప్పటికే శిక్షణ పొందిన పలువురు యువత ఈ తరహా జాబ్ డ్రైవ్‌ల ద్వారా ఉద్యోగాలు సాధించి మంచి స్థాయికి చేరుకున్న విషయం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎస్ ఎస్ సి, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ, ఇంజనీరింగ్, MBA తదితర అర్హత కలిగిన ప్రతి యువకుడు, యువతి ఈ మెగా జాబ్ డ్రైవ్‌ను ఒక మంచి అవకాశంగా తీసుకుని తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.
అభ్యర్థులు తమ రెజ్యూమ్‌లతో హాజరుకావడంతో పాటు, DEET పోర్టల్‌లో నమోదు చేసుకుని అప్లై చేయాలని సూచించారు. జిల్లా యువత ఉపాధి పొందడం ద్వారా వారి కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడటమే కాకుండా, జిల్లా సమగ్ర అభివృద్ధికి కూడా దోహదపడుతుందని తెలిపారు. ఈ దిశగా జిల్లా పరిపాలన యంత్రాంగం పూర్తి మద్దతు అందిస్తుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.






