18 June, 2026 | 1:55 AM

సత్తుపల్లి ఫుడ్ పార్కులో భారీ కుంభకోణం

18-06-2026 12:46 AM

భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కో ఇంచార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆగ్రహం

సత్తుపల్లి (ఖమ్మం జిల్లా), జూన్ 17: వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి కోసం, స్థానిక రైతులకు అండగా నిలుస్తుందనే ఆశతో ఏర్పాటు చేసిన సత్తుపల్లి మెగా ఫుడ్ పార్క్ చివరకు పెద్ద కుంభకోణానికి వేదికగా మారిందని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల కో-ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని ఫుడ్ పార్క్ను బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ జరుగుతున్న వ్యవహారాలను, నిర్మాణాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫుడ్ పార్క్ వ్యవహారంలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, ఈ భారీ అక్రమాల వెనుక ఈ ప్రాంతానికి చెందిన ముఖ్య నాయకుల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ కింద కోల్ స్టోరేజీతో కూడిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వ్యవసాయ ఆధారిత ప్రొడక్ట్ ల కోసం, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో రూ.109.50 కోట్ల అంచనా వ్యయంతో రూపకల్పన చేశారని పొంగులేటి గుర్తు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కాంక్షించి తన వంతుగా ఏకంగా రూ.49.70 కోట్ల భారీ నిధులను కేటాయించిందని స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర కేవలం భూములను సేకరించి ఇవ్వడం మాత్రమేనని, కానీ ఆ ప్రక్రియలోనే పాలకులు అత్యంత దారుణమైన అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. స్థానిక రైతుల నుంచి కేవలం లక్ష, రెండు లక్షల రూపాయల చొప్పున అత్యంత తక్కువ ధరకే భూములను గుంజుకుని, ఈ రోజు వాటిని కార్పొరేట్ శక్తులకు యథేచ్ఛగా ధారాదత్తం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. నిబంధనల ప్రకారం కేబినెట్ అప్రూవల్ (మంత్రిమండలి ఆమోదం) పొందిన తర్వాతే జరగాల్సిన ఇటువంటి కీలకమైన భూకేటాయింపులు, ఎవరి ప్రమేయంతో, ఎవరి ఒత్తిళ్లతో చట్టవిరుద్ధంగా జరిగిపోయాయో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. 

అంతకుముందు సత్తుపల్లి సమీపంలోని గ్రీన్ ఫీల్ హైవేపై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావుతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జొన్నలగడ్డ నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు,జిల్లా కార్యదర్శి వీరంరాజు, సత్తుపల్లి మండల, పట్టణ అధ్యక్షులు బానోతు విజయ్, శాలి శివకృష్ణ, వేంసూర్ మండల అధ్యక్షులు గొర్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు పరస రాంబాబు, రఘునాథరెడ్డి, భీమిరెడ్డి బాలకృష్ణారెడ్డి, బండి వెంకటరెడ్డి, నల్లమోతు నాని బాబు, కొప్పుల మధుసూదన్ రెడ్డి , వేముల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.