16 March, 2026 | 6:08 PM

కాజీపేటలో ‘మహా నిరసన దీక్ష’

16-03-2026 12:00 AM

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలని డిమాండ్

కాజీపేట, మార్చి 15, (విజయక్రాంతి): కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక నిరుద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని, కాజీపేటను వెంటనే రైల్వే డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం అయోధ్యపురంలో ’మహా నిరసన దీక్ష’ నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ దీక్షలో రైల్వే కార్మిక సంఘాలు, భూ నిర్వాసితులు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ పంజాబ్లోని కపుర్తలా, యూపీలోని రాయ్బరేలీ తరహాలోనే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో కూడా స్థానిక యువతకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన అయోధ్యపురం గ్రామస్థులకు, బాధితులకు ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గత 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కాజీపేట రైల్వే డివిజన్ డిమాండ్ను వెంటనే నెరవేర్చాలని, దక్షిణ మధ్య రైల్వేకు 46.8 శాతం లాభాలు అందిస్తున్న కాజీపేటను డివిజన్గా చేయకపోవడం అన్యాయమని నేతలు మండిపడ్డారు.

ఈ ప్రాంత ప్రజల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైల్వే యాక్ట్ అప్రెంటిస్ పూర్తి చేసిన నిరుద్యోగులకు కూడా ఈ ఫ్యాక్టరీలో అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ కాల్వ శ్రీనివాస్, సికింద్రాబాద్ డివిజనల్ సెక్రటరీ రవీందర్, జేఏసీ నాయకులు రాఘవేందర్, వేదప్రకాష్, సమ్మయ్య, రాజేందర్ ఇతర అనుబంధ సంఘాల ప్రతినిధులు దీక్షకు సంఘీభావం తెలిపారు.