24 May, 2026 | 1:05 AM

పీసీసీ చీఫ్‌పై దుష్ప్రచారమా?

24-05-2026 12:09 AM

ఓ టీవీ ఛానల్‌పై బీసీ జేఏసీ చైర్మన్ జాజుల మండిపాటు

హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌పై ఓ ఛానల్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. బడుగులను అవమానించే బిగ్ టీవీ ఛానల్ భరతం పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. బీసీలను రాజకీయంగా అణచివేయాలనే కుట్రలో భాగమే బిగ్ టీవీ ఛానల్ కల్పిత కథనాలు ప్రసారం చేస్తున్నదని విమర్శించారు.

బీసీల మనోభావాలను దెబ్బతీ స్తూ, ఆత్మ గౌరవాన్ని కించపరుస్తున్న అగ్రకుల బిగ్ టీవీ ఛానల్ తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. బీసీ అయి న పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ను డిజాస్టర్ పీసీసీ ప్రెసిడెంట్ అనడం బిగ్ టీవీ ఛానల్ యాజమాన్య అగ్రకుల అహంకారానికి నిదర్శనమన్నారు.

24 గంటల్లో బీసీలకు బిగ్ టీవీ ఛానల్ యాజమాన్యం క్షమాపణ చెప్పాలని లేదంటే ఛానల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మహేశ్‌కుమార్‌గౌడ్ నిజాయతీ గల నాయకుడని చెప్పారు. రెండు, మూడు రోజుల్లోనే బీసీలపై కుట్రలు పన్నిన నేతల పేర్లను బహి ర్గతం చేస్తామని, వారిని బీసీ ద్రోహులుగా ప్రకటిస్తామని చెప్పారు.