4 August, 2026 | 2:48 AM

గాజులరామారంలో భారీ కూల్చివేతలు

04-08-2026 12:22 AM

కలెక్టర్ ఆదేశాలతో ప్రభుత్వ భూమికి రక్షణ

కూల్చివేతలలో స్వల్ప ఉద్రిక్తత

కుత్బుల్లాపూర్, ఆగష్టు 03 (విజయక్రాంతి): గాజులరామారం సర్వే నెంబర్ 49/6 లో సోమవారం కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. కుత్బుల్లాపూర్ మండల పరిధి గాజులరామారం సర్వే నెంబర్ 49/6 లో గల ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వ హయాంలో డిఐఎల్ కు కేటాయించారు. అయితే ఈ భూమి మెదక్ హైవేకు ఆనుకొని ఉండడంతో కబ్జాదారులు ప్లాట్లుగా చేసి పేదలకు అమ్మకాలు చేశారు. ఈ స్థలం కబ్జాపై వరుస ఫిర్యాదులు రావడంతో స్పందించిన కలెక్టర్ కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేశారు.

కలెక్టర్ ఆదేశాలతో సోమవారం పోలీసుల భారీ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు మా ఇళ్లను కూల్చివేయడం ఏంటని బాధితులు అధికారులను నిలదీశారు. దీంతో అధికారులకు, బాధితులకు వాగ్వాదం చోటుచేసుకొని ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. దాదాపు 20 గదులను, కమర్షియల్ షాపులను అధికారులు తొలగించారు. కూల్చివేతలలో కుత్బుల్లాపూర్ తహసీల్దార్ రాజేష్, డీటీ సుధాకర్, ఆర్‌ఐ ఖలీం పాల్గొన్నారు.