విద్యార్థి నాయకులపై నమోదైన కేసులు ఎత్తివేయాలి
పీడీఎస్యూ డిమాండ్
ముషీరాబాద్,ఆగస్టు 3 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో పీడీఎస్యూ సహా లెఫ్ట్ విద్యార్థి సంఘాల నాయకులపై బీఎన్‌ఎస్లోని పలు సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పి. మహేష్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు డిమాండ్ చేశారు. సోమవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బంద్ సందర్భంగా నిజామాబాద్లోని రియాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ వద్ద జరిగిన ఘటనను సాకుగా చూపి విద్యార్థి నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు.
యాజమాన్యంపై ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకుండా, విద్యార్థి సంఘాల నాయకులపైనే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. విద్యార్థి నాయకులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేసి, ఘటనపై పోలీస్ కమిషనర్ సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో కే. శ్రీనివాస్, మంద నవీన్, యశ్వంత్, రహీం, నవదీప్, మాధవ్, శైలజ, అరుణ, సింధు తదితరులు పాల్గొన్నారు.






